పాడైపోయిన క్రీమ్‌తో నకిలీ నెయ్యి తయారీ..

పాడైపోయిన క్రీమ్‌తో నకిలీ నెయ్యి తయారీ.. హైదరాబాద్‌లో 25.5 టన్నుల కల్తీ నెయ్యి సీజ్

Summarize with AI

హైదరాబాద్‌లో(Hyderabad) కల్తీ నెయ్యి (Adulterated Ghee) తయారీ, విక్రయ ముఠాలపై హెచ్‌-ఫాస్ట్ (H-FAST) అధికారులు భారీగా దాడులు నిర్వహించారు. హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ వి.సి. సజ్జనార్‌ (V.C. Sajjanar) వెల్లడించిన వివరాల ప్రకారం.. దాడుల్లో 25.5 టన్నుల కల్తీ నెయ్యితో పాటు 8.7 టన్నుల పాడైపోయిన క్రీమ్‌(Spoiled Cream, 1,200 లీటర్ల పామాయిల్‌, 600 లీటర్ల వనస్పతి, గంజి పొడి, నెయ్యి ఫ్లేవర్‌ బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

హర్యానా, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, తమిళనాడు నుంచి తక్కువ ధరకు పాడైపోయిన క్రీమ్‌ను(Spoiled Cream) తెప్పించి, పాలపొడి, పామాయిల్‌, వనస్పతి తదితర పదార్థాలతో కలిపి నకిలీ నెయ్యి తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.

అసలైన నెయ్యిలా కనిపించేలా మిశ్రమంలో ఇతర పదార్థాలను కలపడంతో పాటు, నెయ్యి వాసన కోసం కెమికల్‌ ఫ్లేవర్లను (Chemical Flavours) వినియోగిస్తున్నట్లు విచారణలో తేలింది. ఈ కల్తీ నెయ్యిని ఆవు నెయ్యి, దేశీ నెయ్యి పేర్లతో మార్కెట్‌లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. హోటళ్లు, ఫంక్షన్‌ హాళ్లు, స్వీట్‌ షాపులు, ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ ఈ నకిలీ నెయ్యిని వినియోగిస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది.

ఎలాంటి తయారీ తేదీ, గడువు తేదీ, సంస్థ పేరు, చిరునామా లేకుండా ప్యాకెట్లలో నెయ్యిని విక్రయిస్తున్నట్లు గుర్తించారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను పరీక్షించగా నెయ్యి నాణ్యతకు సంబంధించిన ఆర్‌ఎం (RM) విలువల్లో భారీ వ్యత్యాసాలు కనిపించినట్లు సీపీ తెలిపారు.

ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడే కల్తీ వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సజ్జనార్‌ హెచ్చరించారు. కల్తీ ఆహారంపై చర్యలను మరింత ముమ్మరం చేసేందుకు TG SAFE విభాగంతో సమన్వయం చేసుకుంటూ నగరవ్యాప్తంగా తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కల్తీ ఆహార పదార్థాలను తయారు చేసి విక్రయించే వారిపై అవసరమైతే పీడీ యాక్ట్‌ కింద కూడా చర్యలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment