తెలంగాణను (Telangana) అన్ని రకాల పెట్టుబడిదారులను ప్రోత్సహించే స్వర్గధామంగా తీర్చిదిద్దడంతో పాటు, క్లీన్ ఎనర్జీ (Clean Energy) రంగానికి ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క(Mallu Bhatti Vikramarka) తెలిపారు. హైదరాబాద్ హైటెక్స్(Hyderabad HITEX), నోవాటెల్‌లో(Novotel) ప్రారంభమైన రెండు రోజుల ‘ఇండియా ఎనర్జీ సమ్మిట్ & ఎక్స్‌పో 2026’(India Energy Summit & Expo 2026) లో ఆయన పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, సాంకేతిక నిపుణులను ఉద్దేశించి ప్రసంగించారు. ఇంధన రంగంలో మార్పు కేవలం విద్యుత్ ఉత్పత్తి విధానాన్ని మార్చడం కాదని, సమగ్ర ఆర్థిక వ్యవస్థను మార్చే విప్లవాత్మక ప్రక్రియ అని అన్నారు. తెలంగాణను క్లీన్ ఎనర్జీ వినియోగించే రాష్ట్రంగా మాత్రమే కాకుండా, ప్రపంచ అవసరాలకు అనుగుణమైన క్లీన్ ఎనర్జీ సాంకేతికతలను తయారు చేసే కేంద్రంగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు.
విద్యుత్ డిమాండ్ (Power Demand) పెరుగుతున్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు అనుగుణంగా చర్యలు చేపడుతున్నామని భట్టి విక్రమార్క తెలిపారు. 2030 నాటికి 20,000 మెగావాట్లు, 2035 నాటికి 26,000 మెగావాట్లకు పైగా సోలార్ విద్యుత్ సామర్థ్యాన్ని(Solar Power Capacity), అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్, పంప్డ్ స్టోరేజ్ ద్వారా 2030 నాటికి 3,800 మెగావాట్లు, 2035 నాటికి 8,000 మెగావాట్ల నిల్వ సామర్థ్యాన్ని అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. ‘భారత్ ఫ్యూచర్ సిటీ’(Bharat Future City)లోని AI డేటా సెంటర్ కోసం 100 మెగావాట్ల ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. 2030 నాటికి ఏటా 4 లక్షల టన్నుల గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, 2035 నాటికి 12,000 EV ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. క్లీన్ ఎనర్జీ పరికరాల తయారీ సంస్థలకు మూలధన సాయం, SGST రీయింబర్స్‌మెంట్, విద్యుత్ సుంకం మినహాయింపులతో పాటు TG-iPASS ద్వారా వేగవంతమైన అనుమతులు అందిస్తున్నామని పేర్కొన్నారు.








