చిన్న శ్రీను కుమార్తెకు హైకోర్టులో షాక్.. రిట్ అప్పీల్ కొట్టివేత

చిన్న శ్రీను కుమార్తెకు హైకోర్టులో షాక్.. రిట్ అప్పీల్ కొట్టివేత

Summarize with AI

విజయనగరం జిల్లా టీడీపీ నేత మ‌జ్జి శ్రీను కుమార్తె, తెర్లాం జడ్పీటీసీ మజ్జి సిరి సహస్ర అలియాస్ ముస్కాన్ జైన్‌కు హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. కుమార్తెను జెడ్పీ చైర్మ‌న్ చేయాల‌న్న మ‌జ్జి శ్రీను ఆశ‌లు మెల్లగా క‌న్న‌గిల్లుతున్నాయి. బీసీ స‌ర్టిఫికెట్‌పై ఆమె దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం కొట్టివేసింది.

జైన్ కుటుంబంలో జ‌న్మించి సిరి స‌హ‌స్ర‌ను మజ్జి శ్రీను ద‌త్త‌త తీసుకున్నారు. సిరి సహస్ర బీసీ సామాజిక వర్గానికి చెందినవారు కాదని, ఆమె సమర్పించిన బీసీ కుల ధ్రువీకరణ పత్రం అసలైనది కాదని హైకోర్టులో పిటిష‌న్ దాఖలైంది.

మజ్జి సిరి సహస్ర బీసీ సామాజిక వర్గానికి చెందినవారా, లేదా అనే అంశంపై ఏడు రోజుల్లో విచారణ జరపాలని జిల్లా కలెక్టర్‌ను హైకోర్టు గతంలో ఆదేశించింది. ఈ వ్యవహారంలో నామినేషన్‌కు సంబంధించి అదనంగా రూ.3,000 చెల్లించాలని కూడా ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సిరి సహస్ర కుల ధ్రువీకరణ అంశాన్ని పరిశీలించేందుకు జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్‌ను రంగంలోకి దింపారు.

కుల ధ్రువీకరణపై విచారణ జరపాలన్న హైకోర్టు ఆదేశాలను సవాల్ చేస్తూ సిరి సహస్ర రిట్ అప్పీల్ దాఖలు చేశారు. ఈ అప్పీల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం ఆమె అభ్యర్థనను తిరస్కరిస్తూ రిట్ అప్పీల్‌ను కొట్టివేసింది.

మరోవైపు, సిరి సహస్ర బీసీ సామాజిక వర్గానికి చెందినవారా, కాదా అనే అంశంపై జిల్లా కలెక్టరే స్వయంగా విచారణ జరపాలని కోరుతూ మరో రిట్ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై నవంబర్ 18న విచారణ జరగనున్నట్లు అందిన వివరాలు వెల్లడిస్తున్నాయి. కుల ధ్రువీకరణ పత్రం చెల్లుబాటు, దానిపై విచారణ నిర్వహించే అధికారి ఎవరనే అంశాలు ఈ కేసులో కీలకంగా మారాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment