సీఈసీపై సుప్రీంకోర్టుకు రాహుల్.. 48 ప్రశ్నలతో పిటిషన్!

సీఈసీపై సుప్రీంకోర్టుకు రాహుల్.. 48 ప్రశ్నలతో పిటిషన్!

Summarize with AI

దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై రాజకీయ వివాదం మరింత ముదురుతోంది. ఎన్నికల సంఘం అనుసరిస్తున్న విధానాలను ప్రశ్నిస్తూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ ప్రక్రియలో పారదర్శకత, ఓటర్ల తొలగింపు, ఎన్నికల సంఘం నిర్ణయాలపై మొత్తం 48 ప్రశ్నలను పిటిషన్‌లో లేవనెత్తారు.

ప్రధాన ఎన్నికల కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్‌తో పాటు మరో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు తమ ప్రశ్నలకు ప్రమాణపత్రాల రూపంలో సమాధానాలు ఇవ్వాలని పిటిషనర్లు కోరారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన పూర్తి వివరాలను న్యాయస్థానం ముందు ఉంచాలని అభ్యర్థించారు.

ముఖ్యంగా ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే సీఈసీ జ్ఞానేష్ కుమార్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారా అనే అంశాన్ని పిటిషనర్లు ప్ర‌ధానంగా ప్రశ్నించారు. కీలక నిర్ణయాలు తీసుకునే సమయంలో ఎన్నికల సంఘంలోని సభ్యుల మధ్య సంప్రదింపులు జరిగాయా అనే విషయంపై స్పష్టత కోరారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ సందర్భంగా వివిధ రాష్ట్రాల్లో తొలగించిన ఓట్ల వివరాలను వెల్లడించాలని పిటిషనర్లు కోరినట్లు పేర్కొంటున్నారు. రాష్ట్రాలవారీగా ఎంతమంది ఓటర్ల పేర్లు తొలగించారు? అందుకు అనుసరించిన ప్రమాణాలేమిటి? అనే అంశాలపై ఎన్నికల సంఘం సమగ్ర వివరాలు సమర్పించాలని అభ్యర్థించారు.

అలాగే ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన ఆన్‌లైన్ పోర్టల్‌లో చేసిన మార్పులపైనా వివరణ కోరారు. పోర్టల్‌లో మార్పులు ఎందుకు చేయాల్సి వచ్చింది? వాటి వల్ల ఓటర్ల నమోదు, సవరణ, తొలగింపు ప్రక్రియపై ఎలాంటి ప్రభావం పడింది? అనే అంశాలను న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.

ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పారదర్శకంగా సాగాలని, అర్హులైన ఓటర్ల హక్కులకు భంగం కలగకుండా చూడాలని విపక్ష నేతలు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు విచారణ, ఎన్నికల సంఘం సమర్పించే వివరణలు కీలకంగా మారనున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment