ఏపీలో విపరీతంగా రైతుల‌ ఆత్మహత్యలు.. సీఎం స‌మీక్ష‌లోనే వెల్ల‌డి (Video)

ఏపీలో విపరీతంగా రైతుల‌ ఆత్మహత్యలు.. సీఎం స‌మీక్ష‌లోనే వెల్ల‌డి (Video)

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరిందని మంత్రులు, ఉన్నతాధికారుల సమీక్ష సమావేశంలో వెల్లడైన గణాంకాలు షాక్‌కు గురిచేస్తున్నాయి. రైతుల కంటే రైతు కూలీలే ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్న విషయం ఈ సమావేశంలో బయటపడటం తీవ్ర చర్చకు దారితీసింది. చంద్ర‌బాబు సర్కారు సమీక్షలో వెల్లడైన వివరాల ప్రకారం, రాష్ట్రంలో వివిధ కారణాలతో వేల సంఖ్యలో ప్రజలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ప్రధాన కారణాలుగా మారాయని అధికారులు తెలిపారు.

ఆత్మహత్యలపై గణాంకాలు
సమీక్షలో వెల్లడైన వివరాల ప్రకారం.. 2025లో ఏపీలో 393 మంది రైతులు, 2,472 మంది రైతు కూలీలు ఆత్మహత్యలు చేసుకున్నారు. మద్యానికి బానిసై 1,544 మంది, కుటుంబ సమస్యలతో 4,456 మంది, ఆర్థిక సమస్యలతో 2,742 మంది, ప్రేమ విఫలమై 447 మంది, నిరుద్యోగం కారణంగా 206 మంది, చదువుల ఒత్తిడితో 191 మంది, పని ఒత్తిడి వలన 31 మంది, ఇతర కారణాలతో 4,500 మంది ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. ఈ సంఖ్యలు రాష్ట్రంలో సామాజిక, ఆర్థిక సంక్షోభం ఎంత తీవ్రంగా ఉందో స్పష్టంగా చూపిస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.

రైతులు, రైతు కూలీలపై పెరుగుతున్న ఒత్తిడి
చంద్రబాబు నాయుడు ప్రభుత్వ హయాంలో రైతులకు హాలాహలమే దిక్కవుతోందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వ్యవసాయ వ్యతిరేక విధానాల వల్ల రైతులు, రైతు కూలీలు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతున్నారని ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో రోజుకు సగటున 8 మంది రైతులు లేదా రైతు కూలీలు ఆత్మహత్య చేసుకుంటున్నారని, అంటే ప్రతి మూడు గంటలకు ఒకరు బతుకు భారమై బలవన్మరణానికి పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మంత్రుల సమావేశంలో వెల్లడి
ఇంత తీవ్రమైన పరిస్థితి మంత్రులు, కార్యదర్శుల అధికారిక సమావేశంలోనే బయటపడటం గమనార్హమని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. సమస్య తీవ్రతను ప్రభుత్వం గుర్తించి, తక్షణమే సమగ్ర చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే రైతులు, రైతు కూలీల మరణాలు మరింత భయంకరంగా మారే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. మొత్తంగా, ఆంధ్రప్రదేశ్‌లో ఆత్మహత్యల పెరుగుదల రాష్ట్ర పాలనపై తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment