వరుస బ్లాక్‌బస్టర్ విజయాలతో టాలీవుడ్‌లో కామెడీకి కొత్త నిర్వచనం చెప్పిన దర్శకుడు అనిల్ రావిపూడి మరోసారి భారీ మల్టీస్టారర్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్‌రామ్ హీరోలుగా నటిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురువారం హైదరాబాద్‌లో ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు సినీ వర్గాల దృష్టిని ఆకర్షించాయి. వెంకటేష్-కళ్యాణ్‌రామ్ తొలిసారి కలిసి నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
శ్రీమతి అర్చన సమర్పణలో, జీ స్టూడియోస్ భాగస్వామ్యంతో తెరకెక్కనున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. పూజా కార్యక్రమం సందర్భంగా విడుదలైన అనౌన్స్‌మెంట్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అరటి ఆకులు, పచ్చని ప్రకృతి నేపథ్యంతో డిజైన్ చేసిన పోస్టర్ పాజిటివ్ వైబ్స్‌ను పంచుతుండగా, అనిల్ రావిపూడి మార్క్ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా సినిమా రాబోతుందనే సంకేతాలు ఇచ్చింది. సంక్రాంతి 2027 కానుకగా విడుదల కానున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం సృష్టించడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








