ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగిత ఆందోళనకర స్థాయిలో ఉంది. రాష్ట్రానికి రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 20 లక్షల ఉద్యోగాలు కల్పించామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెబుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన లేబర్ ఫోర్స్ సర్వే గణాంకాలు చర్చనీయాంశంగా మారాయి. జాతీయ సగటును మించి నిరుద్యోగిత నమోదవడంతో పాటు దేశంలోనే ఏపీ రెండోస్థానంలో ఉన్నట్లు సర్వే వెల్లడించింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగ కల్పన ప్రకటనలపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు శాఖ విడుదల చేసిన జూలై–సెప్టెంబర్ లేబర్ ఫోర్స్ సర్వే బులెటిన్ ప్రకారం దేశవ్యాప్తంగా నిరుద్యోగిత రేటు 5.1 శాతం ఉండగా, ఆంధ్రప్రదేశ్లో ఏకంగా 7.8 శాతంగా నమోదైంది. కేరళం తర్వాత అత్యధిక నిరుద్యోగిత ఉన్న రాష్ట్రంగా ఏపీ రెండోస్థానంలో నిలిచింది.
రాష్ట్రంలో పురుషుల నిరుద్యోగిత 6.8 శాతం ఉండగా, మహిళల్లో ఏకంగా 9.6 శాతంగా నమోదైంది. గ్రామీణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 7.8 శాతం, పట్టణ ప్రాంతాల్లో 8 శాతంగా ఉంది. ముఖ్యంగా గ్రామీణ మహిళల్లో 9.7 శాతం నిరుద్యోగిత నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది.
రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, లక్షలాది ఉద్యోగాలు కల్పిస్తున్నామని చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు క్షేత్రస్థాయిలో పరిస్థితులకు మధ్య వ్యత్యాసం కనిపించడం సంచలనంగా మారింది. రూ.22 లక్షల కోట్ల పెట్టుబడులు, 20 లక్షల ఉద్యోగాలంటూ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు అబద్ధమని సర్వే ఫలితాల ద్వారానే తేలిపోయిందంటున్నారు. ఏపీలో నిరుద్యోగిత జాతీయ సగటు కంటే అధికంగా ఉండటం చర్చకు దారితీసింది.
2024 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, అప్పటివరకు నిరుద్యోగ యువతకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి అందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం ఏర్పడి దాదాపు రెండున్నరేళ్లు కావస్తున్నా నిరుద్యోగభృతి అమలు కాలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఒకవైపు భారీ పెట్టుబడులు, ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం ప్రకటనలు చేస్తుండగా, మరోవైపు నిరుద్యోగితలో ఏపీ అగ్రస్థానాల్లో ఉండటం యువతలో అసంతృప్తికి కారణమవుతోంది. సర్వే గణాంకాలు పత్రికల్లో ప్రచురితం కావడంతో కూటమి ప్రభుత్వ ఉద్యోగ కల్పన హామీలపై చర్చ మరింత తీవ్రమైంది. నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలనే డిమాండ్ పెరుగుతోంది.








