అర‌టి రైతు ఆత్మ‌హ‌త్య‌.. అనంతపురం జీజీహెచ్‌లో ఉద్రిక్తత

అర‌టి రైతు ఆత్మ‌హ‌త్య‌.. అనంతపురం జీజీహెచ్‌లో ఉద్రిక్తత

అప్పుల బాధ తాళ‌లేక అనంతపురం జిల్లాలో అర‌టి రైతు ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ ఘ‌ట‌న ఉద్రిక్త‌త‌ల‌కు దారితీసింది. రైతు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వైసీపీ నేత‌లు వ‌స్తున్నార‌ని తెలిసి ఉద‌యం 8 గంట‌ల‌కే పోస్టుమార్టం చేసి రైతు మృత‌దేహాన్ని త‌ర‌లించ‌డంతో ఉద్రిక్త‌త నెల‌కొంది.

వివ‌రాల్లోకి వెళితే.. శింగనమల నియోజకవర్గానికి చెందిన పుట్లూరు మండలం ఎల్లుట్ల గ్రామానికి చెందిన అరటి రైతు నాగలింగం (40) అప్పుల బాధ తాళలేక పురుగుల మందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. విష‌యం తెలుసుకొని రైతు కుటుంబాన్ని ప‌రామ‌ర్శించేందుకు వైసీపీ నేత‌, మాజీ మంత్రి శైల‌జానాథ్ ఉదయం 10 గంటలకు ఆసుపత్రికి వెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 8 గంటలకు రైతు నాగలింగం మృతదేహానికి పోస్ట్‌మార్టం చేసి ఇంటికి త‌ర‌లించ‌డం ఉద్రిక్తతకు కారణమైంది.

పోస్ట్‌మార్టం త్వరగా పూర్తి చేసి మృతదేహాన్ని ఎందుకు తొందరపాటుతో తరలించారని శైలజానాథ్ ప్రశ్నించారు. రైతు కుటుంబాన్ని వైసీపీ నేతలు పరామర్శిస్తే తప్పేమిటని, కానీ తమను అడ్డుకోవడం ఎందుకని ఆయన నిలదీశారు. మృతదేహం తరలింపుపై పోలీసుల నిర్ణయంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు ఎవరు ఆత్మహత్య చేసుకోవద్దని, ప్రాణం పోతే మళ్లీ రాదు.. ప్రభుత్వంతో కొట్లాడదామ‌ని సూచించారు.

ఈ సంఘటన సమయంలో శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి కూడా జీజీహెచ్‌కు చేరుకున్నారు. రైతు కుటుంబానికి న్యాయం జరిగేలా, ప్రభుత్వం బాధిత కుటుంబానికి వెంటనే సాయం ప్రకటించేలా ఒత్తిడి తేవాలని తామంతా కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి శైలజానాథ్ ఆమెకు సూచించారు. రైతుల ఆత్మహత్యలపై ప్రభుత్వం అలక్ష్యం చేస్తోందని, దీనిపై విపక్షాలు బలమైన ఉద్యమం చేపట్టాలని ఆయన అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now

Leave a Comment