టీడీపీ నేతల దాడులపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చిన్న కుమార్తె అంబటి శ్రీజ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికా నుంచి వీడియో విడుదల చేసిన ఆమె, తమ కుటుంబం ఎదుర్కొన్న దారుణ పరిణామాలను భావోద్వేగంగా వివరించారు. టీడీపీ శ్రేణులు తమ ఇంటిపై రాళ్లతో దాడి చేశాయని, తొమ్మిది గంటల పాటు గుంపులుగా వచ్చి విధ్వంసం సృష్టించారని ఆమె ఆరోపించారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తమ ఇంటికి వచ్చి అండగా నిలిచారని శ్రీజ తెలిపారు. తమ తల్లి, అక్కలతో మాట్లాడి ధైర్యం నింపారని చెప్పారు. “టీడీపీ వాళ్లు మా ఇంటిపై దాడి చేశారు కానీ, నిన్న వేలమంది అభిమానంతో మా ఇంటికి వచ్చారు. మా నాన్న చెప్పినట్టే మాకు అండగా వెంకటేశ్వరస్వామి ఉన్నారు. దేవుడి అండ ఉన్నంతవరకు మాపై వేసే ప్రతి రాయి పువ్వుగా మారుతుంది” అంటూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.
ఉదయం గుడికి వెళ్లిన సమయంలోనే తన తండ్రిపై టీడీపీ శ్రేణులు దాడి చేశారని, కర్రలతో వచ్చి అంబటి రాంబాబుపై దాడికి పాల్పడ్డారని శ్రీజ తెలిపారు. టీడీపీ మహిళలు కూడా బూతులతో దూషించారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సమయంలో తన తండ్రి కొన్ని మాటలు మాట్లాడారని, ఆ వెంటనే అవి అనకూడదని రియలైజ్ అయ్యి వెనక్కి తీసుకున్నారని, లీగల్‌గా ఎదుర్కొంటానని కూడా చెప్పారని స్పష్టం చేశారు.
అయితే, ఆ కారణంతో తమ ఇంట్లో ఉన్న మహిళలను దారుణంగా తిడుతూ దాడులు చేశారని శ్రీజ ఆరోపించారు. కాపు కులాన్ని ఉద్దేశించి బూతులు జోడించి దూషించడం మరింత బాధాకరమని చెప్పారు. “ఒక డాక్టర్ అయిన కేంద్ర మంత్రి ఈ దాడులను నడిపించడం చాలా దారుణం. ఆయన మేధస్సు ఆయన్ని సరైన మార్గంలో పెట్టలేదా అని అనిపిస్తోంది” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
అంబటి రాంబాబును నాలుగు గోడల మధ్య భౌతికంగా వేధించడం అమానుషమని, ఆయనను వేధించి కొందరు రాక్షసానందం పొందారని శ్రీజ విమర్శించారు. అయితే రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని, దాడి చేసిన దానికంటే నాలుగు రెట్లు ఎక్కువగా ప్రజల నుంచి తమకు అభిమానం లభించిందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.









అరేయ్.. ఇటు రారా.. లం***కా.. – పోలీసులపై జగ్గారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు