తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆ రాష్ట్ర రాజకీయ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేశాయి. 108 సీట్లతో అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమైంది. మేజిక్ ఫిగర్ (118) కు కేవలం 10 సీట్ల దూరంలో నిలిచిన విజయ్.. కాంగ్రెస్, వామపక్షాల మద్దతు కోరుతుండగా, మరోవైపు ప్రతిపక్ష అన్నాడీఎంకేలో అలజడి మొదలైంది.
అధికారం కోసం అన్నాడీఎంకే వెంపర్లాట?
గత ఐదేళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న అన్నాడీఎంకే నేతలు, ఇప్పుడు విజయ్ విజయంతో తమ రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో పడ్డారు. తాజా సమాచారం ప్రకారం, దాదాపు 35 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు విజయ్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి నాయకత్వంపై అసంతృప్తిగా ఉన్న ఈ వర్గం, ఎలాగైనా అధికార పక్షంలో భాగం కావాలని భావిస్తోంది.
రహస్య చర్చలు
అన్నాడీఎంకే సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ సీవీ షణ్ముగం కార్యాలయంలో సుమారు 35 మంది ఎమ్మెల్యేలు సమావేశమైనట్లు వార్తలు వస్తున్నాయి. వీరంతా టీవీకేలో విలీనం కావాలా లేక బయటి నుంచి మద్దతు ఇవ్వాలా అనే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. విజయ్ నుంచి చిన్నపాటి సంకేతం వస్తే చాలు, క్యూ కట్టేందుకు వీరు సిద్ధంగా ఉన్నారని తమిళనాట ప్రచారం జోరందుకుంది.
సామాన్య ప్రజలు, యువత మార్పు కోరుతూ విజయ్‌కి పట్టం కట్టారు. అయితే, ఇప్పుడు అధికార పీఠం కోసం అన్నాడీఎంకే లాంటి పాత పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటే, విజయ్ పార్టీ కూడా ‘అవినీతి పార్టీ’గా మారిపోయే ప్రమాదం ఉందని రాజకీయ విమర్శకులు హెచ్చరిస్తున్నారు. స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తానని మాటిచ్చిన విజయ్, ఈ ఫిరాయింపుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్నది ఆసక్తికరంగా మారింది.
దశాబ్దాలుగా తమిళనాడును ఏలుతున్న ద్రవిడ పార్టీల్లో (DMK, AIADMK) ఇలాంటి చీలికలు రావడం సంచలనం సృష్టిస్తోంది. విజయ్ రాకతో డీఎంకే కోటలు బద్దలవ్వడమే కాకుండా, అన్నాడీఎంకే మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ ఇప్పటికే షరతులతో కూడిన మద్దతు ప్రకటించగా, అన్నాడీఎంకే ఎమ్మెల్యేల చేరికతో టీవీకే బలం మరింత పెరిగే అవకాశం ఉంది.








