టీమిండియా స్టార్ వికెట్‌కీపర్-బ్యాటర్ రిషభ్ పంత్ మరో అరుదైన ఘనతను తన ఖాతాలో వేసుకున్నాడు. మైదానంలో సాహసోపేత బ్యాటింగ్‌తో అభిమానులను అలరించే పంత్, ఇప్పుడు ఆర్థిక పరంగానూ వార్తల్లో నిలిచాడు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఏకంగా రూ.23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి, తన సొంత రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచాడు. ఒకప్పుడు గురుద్వారాలో ఉచిత భోజనం చేస్తూ క్రికెట్ సాధన కొనసాగించిన పంత్, తన అంకితభావం, కష్టంతో కేవలం పదేళ్ల వ్యవధిలోనే వందల కోట్ల ఆస్తులను సంపాదించిన భారత క్రికెట్‌లోని అత్యంత విజయవంతమైన ఆటగాళ్లలో ఒకరిగా ఎదిగాడు. ప్రస్తుతం అతని నికర ఆస్తుల విలువ సుమారు రూ.120 నుంచి రూ.150 కోట్ల మధ్య ఉంటుందని అంచనా.
రిషభ్ పంత్ ఆదాయంలో ప్రధాన వాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) నుంచే వస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలంలో లక్నో సూపర్ జెయింట్స్ అతడిని రికార్డు స్థాయి రూ.27 కోట్లకు కొనుగోలు చేయగా, బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్, అంతర్జాతీయ మ్యాచ్ ఫీజులు కూడా అతని ఆదాయాన్ని మరింత పెంచుతున్నాయి. అదనంగా అడిడాస్, డ్రీమ్11, బోట్, జేఎస్‌డబ్ల్యూ వంటి ప్రముఖ బ్రాండ్లకు అంబాసిడర్‌గా వ్యవహరిస్తూ ప్రకటనల ద్వారానూ భారీగా సంపాదిస్తున్నాడు. ఢిల్లీ, డెహ్రాడూన్, రూర్కీలలో విలాసవంతమైన ఇళ్లు, ఆడి A8, ఫోర్డ్ ముస్తాంగ్, మెర్సిడెస్ బెంజ్ GLE వంటి ఖరీదైన కార్లు పంత్ లైఫ్‌స్టైల్‌కు నిదర్శనంగా నిలుస్తున్నాయి. అంతేకాకుండా వరల్డ్ పికిల్‌బాల్ లీగ్‌లో ఓ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తూ వ్యాపార రంగంలోనూ తన ముద్ర వేస్తున్నాడు. కష్టపడి ఎదిగిన యువ క్రికెటర్‌గా పంత్ ప్రయాణం ఎంతోమందికి స్ఫూర్తిదాయకంగా మారింది.








