చంద్రబాబు ప్రభుత్వం మరో అప్రతిష్టను మూటగట్టుకుంది. 2014లో అధికారంలోకి వచ్చాక విజయవాడలో ఏకంగా 40కి పైగా ఆలయాలను కూల్చివేత పాపాన్ని చంద్రబాబు సర్కార్ మూటగట్టుకుంది. చంద్రబాబు కూల్చిన ఆలయాలను జగన్ సర్కార్ పునర్మించింది.
ఈసారి రేణిగుంటలో వెయ్యేళ్ల చరిత్ర కలిగిన అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని చంద్రబాబు సర్కార్ కూల్చేసి మరో అప్రతిష్టను మూటగట్టుకుంది. రేణిగుంట మండలం ఆంజనేయపురంలో పురాతన అభయ ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేయడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప–రేణిగుంట జాతీయ రహదారి 716 విస్తరణలో భాగంగా ఆలయాన్ని తొలగించడాన్ని ఆయన అడ్డుకున్నారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఆలయాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కూల్చివేయడం దారుణమని మండిపడ్డారు.
ఆంజనేయపురంలోని అభయ ఆంజనేయస్వామి ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉందని భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. పల్లవ రాజుల కాలంనాటి ఈ పురాతన ఆలయంలో అగస్త్య మహాముని, అన్నమయ్య పూజలు నిర్వహించారని తెలిపారు. కంచి చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామీజీ సైతం ఈ ఆలయాన్ని దర్శించి పూజలు చేశారని గుర్తుచేశారు. ఇంతటి చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఆలయాన్ని రహదారి విస్తరణ పేరుతో తొలగించడం హిందువుల మనోభావాలను దెబ్బతీయడమేనని విమర్శించారు.
జాతీయ రహదారి విస్తరణలో భాగంగా రోడ్డు డిజైన్‌ను మార్చి ఆలయాన్ని పరిరక్షించే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నించలేదని భూమన మండిపడ్డారు. ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించకుండా పురాతన ఆలయాన్ని కూల్చివేయడం వెనుక కక్షసాధింపు ధోరణి ఉందని విమర్శించారు.
సనాతన ధర్మ పరిరక్షణ గురించి తరచూ మాట్లాడే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ ఆలయ కూల్చివేతపై ఏం సమాధానం చెబుతారని భూమన ప్రశ్నించారు. “సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తామంటున్న పవన్ కళ్యాణ్‌కు హిందూ ఆలయాల పరిరక్షణ అంటే ఇదేనా? వేల ఏళ్ల చరిత్ర ఉన్న ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చివేస్తుంటే ఏం చేస్తున్నారు?” అంటూ నిలదీశారు.
హిందూ ఆలయాల పరిరక్షణ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని భూమన కరుణాకరరెడ్డి విమర్శించారు. పురాతన ఆలయాలను కాపాడాల్సిన ప్రభుత్వమే వాటి కూల్చివేతకు పాల్పడటం బాధాకరమన్నారు. చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యత కలిగిన ఆలయాల పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.








