పవన్ మాట లెక్కచేయని మంత్రి ఆనం.. జనసేనలో చిచ్చు!

పవన్ మాట లెక్కచేయని మంత్రి ఆనం.. జనసేనలో చిచ్చు!

Summarize with AI

కూట‌మిలో జ‌న‌సేన పార్టీకి ఎంత ప్రాముఖ్య‌త‌, ప్రాధాన్య‌త ఉందో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల సంద‌ర్భంగా జ‌రిగిన ప‌రిణామాలు చూస్తే అర్థం అవుతుంది. అది సీట్ల వాటా నుంచి ప‌ద‌వుల కేటాయింపు వ‌ర‌కూ. జ‌న‌సేన పార్టీని ఒక రాజ‌కీయ పార్టీగా కూడా తెలుగుదేశం పార్టీ శ్రేణులు లెక్క‌పెట్ట‌డం లేదు. ఈ తంతు క్షేత్ర‌స్థాయిలోనే కాదు ఏకంగా కేబినెట్ మంత్రుల వ‌ర‌కూ అదే ధోర‌ణి క‌నిపిస్తోంది.

తాజాగా ఆత్మకూరు మునిసిపల్ వైస్ చైర్మన్ ఎన్నిక అధికార కూటమిలో కొత్త వివాదానికి దారితీసింది. జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించిన అభ్యర్థిని కాదని మరో వ్యక్తిని వైస్ చైర్మన్‌గా మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఎంపిక చేయడం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. మంత్రి ఆనం వ్యవహారశైలిపై జ‌న‌సైనికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని సైతం మంత్రి ఆనం లెక్కచేయడం లేదంటూ మండిపడుతున్నారు.

ఆత్మకూరు మునిసిపల్ వైస్ చైర్మన్ పదవికి జనసేన తరఫున శిరీష పేరును పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అయితే ఆమెకు బదులుగా మరో జనసేన కౌన్సిలర్ పద్మ పేరును వైస్ చైర్మన్‌గా మంత్రి ఆనం ఖరారు చేయడం వివాదానికి కారణమైంది. పవన్ కళ్యాణ్ నిర్ణయాన్ని పక్కనపెట్టి మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తనకు అనుకూలమైన అభ్యర్థిని తెరపైకి తీసుకొచ్చారని జనసేన శ్రేణులు మండిపడుతున్నాయి.

మంత్రి ఆనం వ్యవహారశైలిని నిరసిస్తూ ఆత్మకూరు జనసేన ఇన్‌చార్జ్ శ్రీధర్‌తో పాటు పలువురు పార్టీ నాయకులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో శ్రీధర్ సహా పలువురు జనసేన నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. వైస్ చైర్మన్ పదవి విషయంలో తమ పార్టీ అధినేత నిర్ణయానికే విలువ లేకుండా పోయిందని జనసేన నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ స్వయంగా ప్రకటించిన అభ్యర్థికే పదవి దక్కకపోవడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది. జనసేనకు కేటాయించిన పదవి విషయంలోనూ మంత్రి ఆనం జోక్యం చేసుకుని అభ్యర్థిని మార్చేశారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.

ఆత్మకూరులో జనసేన నాయకుల మధ్య విభేదాలకు ఈ పరిణామం దారితీసింది. ఒకవైపు కూటమి ఐక్యత గురించి మాట్లాడుతూనే మరోవైపు జనసేన అధినేత నిర్ణయాన్ని పక్కనపెట్టడం ఏమిటని పార్టీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి. ఈ వివాదంపై పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment