ఏపీలో సర్పంచ్ పదవికి రూ.1.5 కోట్ల వేలం

ఏపీలో సర్పంచ్ పదవికి రూ.కోటిన్నర బేరం

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సర్పంచ్ పదవుల ఏకగ్రీవాల కోసం భారీ ఆఫర్లు తెరపైకి వస్తున్నాయి. అధికార పార్టీ నేతలు గ్రామ సర్పంచ్‌గా తమను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే లక్షలు, కోట్లు ఇస్తామంటూ ముందుకొస్తున్నారు. తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో సర్పంచ్ పదవుల కోసం జరుగుతున్న బేరసారాలు చర్చనీయాంశంగా మారాయి.

తూర్పుగోదావరి జిల్లా దుళ్ల గ్రామంలో సర్పంచ్‌గా తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.కోటి ఇస్తానని ఓ వ్యక్తి ప్రకటించారు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ ఎంబీబీఎస్ విద్యార్థి మరో అడుగు ముందుకేసి, తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే రూ.1.50 కోట్లు ఇస్తానని ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో సర్పంచ్ పదవికి ఏకగ్రీవ ఎన్నిక వ్యవహారం గ్రామంలో ఆసక్తికరంగా మారింది.

అదే విధంగా పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం మండలం తూర్పుతాళ్లులోనూ సర్పంచ్ పదవి కోసం పోటీ నెలకొంది. తనను ఏకగ్రీవంగా ఎన్నుకుంటే గ్రామ పెద్దలకు ఎకరం పొలం రాసిస్తానని ఓ అభ్యర్థి ఆఫర్ చేయగా, మరో అభ్యర్థి రూ.50 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.

ఈ ఆఫర్లపై గ్రామ పెద్దలు చర్చించినట్లు చెబుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సర్పంచ్ పదవుల కోసం భారీ మొత్తంలో డబ్బులు, భూములు ఆఫర్ చేస్తున్నారనే ప్రచారంతో ఆయా గ్రామాల్లో పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. ఈ బేరసారాలపై అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment