సోనియా జీవిత చరిత్రపై సినిమా.. భ‌క్తి చాటుకోనున్న జగ్గారెడ్డి

సోనియా జీవిత చరిత్రపై సినిమా.. భ‌క్తి చాటుకోనున్న జగ్గారెడ్డి

Summarize with AI

కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ జీవిత చరిత్ర ఆధారంగా తెలుగులో సినిమా నిర్మించనున్నట్లు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రకటించారు. సంగారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. సోనియాగాంధీ ఆత్మకథగా పేర్కొన్న ‘బీ లాంగింగ్ ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తానని తెలిపారు. ఇందుకోసం పార్టీ నాయకులు డబ్బులు సిద్ధం చేసుకోవాలని సూచించారు.

సోనియాగాంధీ జీవిత చరిత్రను ప్రజలకు సినిమా ద్వారా తెలియజేయాలన్నదే తన లక్ష్యమని జగ్గారెడ్డి చెప్పారు. ఇందిరాగాంధీ కోడలిగా, రాజీవ్ గాంధీ భార్యగా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీల తల్లిగా ఆమె జీవితంలోని ముఖ్యమైన ఘట్టాలను సినిమాలో చూపిస్తామన్నారు. సంగారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలే ఈ చిత్రానికి నిర్మాతలుగా వ్యవహరిస్తారని వెల్లడించారు.

సినిమా నిర్మాణం కోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేతుల మీదుగా సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని ప్రకటించారు.

సోనియాగాంధీకి దేశ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉందని జగ్గారెడ్డి కొనియాడారు. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ దేశం కోసం చేసిన ప్రాణత్యాగాలను ఆమె దగ్గరుండి చూశారని పేర్కొన్నారు. సోనియాగాంధీకి ప్రధాని పదవిపై వ్యామోహం లేదని వ్యాఖ్యానించారు.

రాజీవ్ గాంధీ మరణానంతరం పీవీ నరసింహారావు ప్రధానమంత్రి అయ్యారని గుర్తుచేశారు. అలాగే యూపీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు సోనియాగాంధీ ప్రధాని కావాలని పలువురు కోరినా, ఆమె ఆ అవకాశాన్ని వదులుకుని మన్మోహన్ సింగ్‌ను ప్రధానిగా ప్రతిపాదించారని చెప్పారు. ప్రధాని అయ్యే అవకాశం ఉన్నప్పటికీ పదవిని వదులుకోవడం చరిత్రలో నిలిచిపోతుందని అభిప్రాయపడ్డారు.

ఆమె రాజకీయ జీవితం, కుటుంబ నేపథ్యం, దేశ రాజకీయాల్లో పోషించిన పాత్రను ఈ సినిమా ద్వారా ప్రజల ముందుకు తీసుకువస్తామని తెలిపారు.

Join WhatsApp

Join Now

Leave a Comment