హైదరాబాద్లో కలర్ జిరాక్స్ చెక్కులతో రూ.25 లక్షల మోసానికి పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పంజాగుట్టకు చెందిన వీరలింగేశ్వర రెడ్డి అనే వ్యక్తి నుంచి విజయనగరానికి చెందిన పైలా జ్యోతి, కోతాలి గౌరి నాయుడు అప్పుగా డబ్బులు తీసుకున్నారు. తిరిగి చెల్లించే సమయంలో నకిలీ చెక్కులు ఇచ్చి మోసం చేశారంటూ బాధితుడు పోలీసులను ఆశ్రయించారు.
2025 ఫిబ్రవరిలో వీరలింగేశ్వర రెడ్డి నుంచి పైలా జ్యోతి రూ.15 లక్షలు, కోతాలి గౌరి నాయుడు రూ.10 లక్షలు అప్పుగా తీసుకున్నారు. గడువు దాటినా డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో అప్పు ఒప్పంద పత్రాల ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని వీరలింగేశ్వర రెడ్డి హెచ్చరించారు.
దీంతో అప్పు మొత్తం చెల్లిస్తామంటూ ఇద్దరూ చెక్కులు ఇచ్చారు. వాటిని నమ్మిన వీరలింగేశ్వర రెడ్డి తన వద్ద ఉన్న అప్పు ఒప్పంద పత్రాలను వారికి తిరిగి ఇచ్చేశారు. అనంతరం చెక్కులను ఎస్బీఐలో డిపాజిట్ చేయగా, అవి కలర్ జిరాక్స్ కాపీలని బ్యాంకు సిబ్బంది గుర్తించారు.
దీంతో తాను మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ చెక్కుల వ్యవహారంపై పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.








