విజయవాడలో (Vijayawada) వైభవంగా సాగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల (Dussehra Sharannavaratri Celebrations) వేళ, ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘విజయవాడ ఉత్సవ్'(Vijayawada Utsav) కార్యక్రమం తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri) శ్రీ కనకదుర్గమ్మ (Sri Kanaka Durga Devi) దర్శనానికి వచ్చే సామాన్య భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించడంలో అధికార యంత్రాంగం విఫలమైందనే విమర్శలు వస్తుండగా, మరోవైపు ఈ ‘ఉత్సవ్'(Utsav) పేరిట వ్యాపారులు, పారిశ్రామికవేత్తల నుంచి భారీగా నిధుల వసూళ్లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
క్యూలైన్లలో భక్తుల అవస్థలు.. పబ్లిసిటీకే ప్రాధాన్యం
దసరా నవరాత్రుల వేళ రాష్ట్రం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇంద్రకీలాద్రికి తరలివస్తున్నారు. అయితే ఉత్సవాల తొలి రోజు నుంచే క్యూలైన్లలో గంటల తరబడి నిలబడలేక భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మంచినీరు(Drinking Water), క్యూలైన్ల నిర్వహణ(Queue Management), వైద్య సేవలు (Medical Services) అందించడంలో అధికారులు విఫలమయ్యారని భక్తులు వాపోతున్నారు.
భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాల్సిన అధికార యంత్రాంగం అంతా ‘విజయవాడ ఉత్సవ్'(Vijayawada Utsav), ‘సరస్’ (SARAS)ప్రచార ఆర్భాటాల్లో మునిగిపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజాధనం, ప్రభుత్వ యంత్రాంగాన్ని కేవలం పబ్లిసిటీ స్టంట్ల కోసమే వాడుకుంటున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వ్యాపారులపై ఒత్తిళ్లు.. వసూళ్లు?
ఈ ఉత్సవాల నిర్వహణ వెనుక స్థానిక ఎంపీ కేశినేని చిన్నితో(Kesineni Chinni) పాటు అధికార పార్టీ నేతల హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని దాదాపు 200 వ్యాపార సంఘాలు, హోటళ్ల నిర్వాహకులు, పరిశ్రమల అధిపతుల నుంచి ఒక్కొక్కరి వద్ద రూ. 25,000 వరకు బలవంతంగా వసూలు చేస్తున్నారని, విద్యుత్ దీపాలు, అలంకరణల పేరుతో ఒత్తిడి తెస్తున్నారని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
పున్నమి ఘాట్(Punnami Ghat), మాకినేని బసవపున్నయ్య స్టేడియం(Makineni Basava Punnaiah Stadium), తుమ్మలపల్లి కళాక్షేత్రం వంటి ప్రభుత్వ ప్రాంగణాల్లో స్టాళ్ల కేటాయింపుకు లక్షల్లో అద్దెలు వసూలు చేస్తున్నప్పటికీ.. ఈ నిధుల సమీకరణ, వ్యయంపై ఎలాంటి పారదర్శకత లేదని ప్రతిపక్ష వైసీపీ ప్రశ్నిస్తోంది. గతేడాది వసూళ్ల లెక్కలను కూడా ఇప్పటికీ వెల్లడించకపోవడం అనుమానాలకు తావిస్తోంది.
వెస్ట్రన్ కల్చర్‌కే ప్రాధాన్యం
విజయవాడ మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా ఎదిగిన చారిత్రక ప్రస్థానం, నగర అభివృద్ధికి కృషి చేసిన మహనీయుల సేవలను చాటిచెప్పేలా ఉత్సవాలు ఉండాలని నగరవాసులు కోరుకుంటున్నారు. అయితే స్థానిక కళాకారులు, చరిత్రను పక్కనపెట్టి కేవలం డ్యాన్సులు, వినోద కార్యక్రమాలు, పాశ్చాత్య సంస్కృతికే పెద్దపీట వేస్తున్నారని మండిపడుతున్నారు.
ప్రజా సమస్యల నుంచి డైవర్షన్ రాజకీయం
రాష్ట్రంలో నిత్యావసరాల ధరల (Essential Commodities) పెరుగుదల, ఎరువుల కొరత(Fertiliser Shortage), సంక్షేమ పథకాలు నిలిచిపోవడం వల్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తిని పక్కదారి పట్టించడానికే కూటమి ప్రభుత్వం ఇలాంటి ప్రచార దృశ్యకావ్యాలను తెరపైకి తెస్తోందని ఆరోపణలు వస్తున్నాయి.
కేవలం లైటింగ్, బాణసంచా మెరుపులతో ప్రజలను మభ్యపెట్టడం తప్ప ఈ ఉత్సవాల వల్ల సామాన్యుడికి ఒరిగేదేమీ లేదని, అసలైన ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రభుత్వం మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని విపక్షాలు, సాధారణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.








