నేపాల్‌లోని (Nepal) మధ్య ప్రాంతంలో వారాంతంలో సంభవించిన వరదల (Floods) కారణంగా 100 మందికి పైగా విదేశీ ట్రెక్కర్లు వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. గోర్ఖా జిల్లాలో(Gorkha District) కొండచరియలు విరిగిపడటంతో బుధి గండకి నదికి(Budhi Gandaki River) అడ్డంకి ఏర్పడి, ఆ తర్వాత వరదలు సంభవించాయి. దీంతో ట్రెక్కింగ్ మార్గాలు, వంతెనలు కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఖాట్మండుకు సుమారు 100 కిలోమీటర్ల దూరంలోని ఈ ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఆదివారం కొండచరియలు విరిగిపడిన ఘటనలో నదికి అడ్డంకి ఏర్పడటంతో వచ్చిన వరదల నుంచి తొమ్మిది మంది విదేశీయులతో సహా మొత్తం 96 మందిని అధికారులు రక్షించారు. అయితే, ట్రెక్కింగ్ మార్గంలోని (Trekking Route) కొన్ని భాగాలు కొట్టుకుపోవడంతో మరో 100 మందికి పైగా విదేశీ పర్యాటకులు వెనక్కి తిరిగి రాలేకపోతున్నారని మనస్లు పరిరక్షణ ప్రాంత ప్రాజెక్టు అధికారి భువన్ రాజ్ ఓజా (Bhuvan Raj Ojha) తెలిపారు. వరద నీరు తగ్గినప్పటికీ, గల్లంతైన ఐదుగురు గ్రామస్థుల ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. వరదల కారణంగా ఇళ్లు, మౌలిక సదుపాయాలు దెబ్బతినడంతో పాటు మూడు జలవిద్యుత్ కేంద్రాలు (Hydropower Plants) కూడా దెబ్బతిన్నాయి.
ప్రస్తుతం చిక్కుకుపోయిన ట్రెక్కర్లను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు నేపాల్ సైన్యం (Nepal Army) సహా సంబంధిత అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. సురక్షితంగా ఉన్న ప్రాంతాల్లోని రెస్టారెంట్లు, టీ హౌస్‌లలో పర్యాటకులు ఉండవచ్చని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో నదికి తాత్కాలికంగా ఏర్పడిన అడ్డంకి తొలగిపోవడం వల్లే వరదలు సంభవించి ఉండవచ్చని అంతర్జాతీయ సమగ్ర పర్వతాభివృద్ధి కేంద్రం (ICIMOD) ప్రాథమికంగా అంచనా వేసింది. పర్వత ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు, కొండచరియల ప్రమాదాలను ఎదుర్కొనేందుకు ముందస్తు చర్యలు అవసరమని నిపుణులు సూచించారు.








