చికిత్స పొందేందుకు వచ్చిన ఒక నిస్సహాయుడిని కాపాడాల్సింది పోయి, అమానుషంగా ఆసుపత్రి బయట వదిలేయడంతో అతడు ప్రాణాలు కోల్పోయిన సంఘటన గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రి (GGH)లో తీవ్ర కలకలం రేపుతోంది.
కాలి గాయంతో తీవ్ర నొప్పితో బాధపడుతున్న దాదాపు 40 ఏళ్ల అనాథ వ్యక్తి (Orphaned Man)మూడు రోజుల క్రితం గుంటూరు జీజీహెచ్‌కు (Guntur GGH) వచ్చాడు. అత్యవసర విభాగంలో వైద్యులు ప్రథమ చికిత్స చేసి కట్టు కట్టినప్పటికీ, అతడు నడవలేని స్థితిలోనే ఆసుపత్రి ప్రాంగణంలో ఉండిపోయాడు.
ఆదివారం ఆసుపత్రికి చెందిన భద్రతా సిబ్బంది అతడిని స్ట్రెచర్‌పై (Stretcher) తీసుకెళ్లి మార్చురీ (Mortuary) సమీపంలోని ప్రధాన గేటు బయట పడేసినట్లు తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. కదలలేని స్థితిలో ఉన్న ఆ వ్యక్తి తీవ్రమైన ఎండలో గేటు బయటే పడివుండగా, స్థానికులు గమనించి మానవతా దృక్పథంతో ఆహారం(Food), మంచినీరు (Drinking Water) అందించారు. అయినప్పటికీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో అతడు సోమవారం అక్కడే కన్నుమూశాడు.
పోలీసు కేసు: మృతుడి వివరాలు, గుర్తింపు పత్రాలు లభించకపోవడంతో పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై విమర్శలు వెల్లువెత్తడంతో జీజీహెచ్ సీఎస్‌ఆర్‌ఎంవో బి.వి. రావు (B.V. Rao) స్పందించారు. మృతుడిని ప్రాథమికంగా యాచకుడిగా భావిస్తున్నామని, అసలు అతడిని బయటకు ఎవరు తీసుకెళ్లారు, ఎవరి ఆదేశాలతో వదిలేశారు అనే అంశాలపై శాఖాపరమైన విచారణకు ఆదేశించినట్లు వెల్లడించారు.
కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించిన సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.








