FBI ఫ్రమ్ గుంటూరు.. ఎక్స్‌ కూడా షాక్!

FBI ఫ్రమ్ గుంటూరు.. ఎక్స్‌ కూడా షాక్!

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో సోషల్ మీడియా పోస్టుల తొలగింపు వ్యవహారం ఇప్పుడు కొత్త వివాదానికి దారితీసింది. ఈ మ‌ధ్య‌కాలంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఎవ‌రు పోస్ట్ పెట్టినా వాటిని మెటా సంస్థ‌కు ఫిర్యాదు చేయించి తొల‌గిస్తున్న విష‌యం తెలిసిందే. అమ‌రావ‌తి, హెరిటేజ్‌, డీఎస్సీ వంటి అంశాల‌పై ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే.. వారి పోస్టులు ఇండియాలో క‌నిపించ‌డం లేదు. ఈ సెన్సార్షిప్ సోష‌ల్ మీడియా యాక్టివిస్టుల వ‌ర‌కే ప‌రిమితం కాలేదు.. మీడియా ఛాన‌ళ్ల వ‌ర‌కు పాకింది.

అయితే ఈ సెన్సార్షిప్‌పై ఎక్స్ భ‌యంక‌ర‌మైన విష‌యాల‌ను బ‌య‌ట‌పెట్టింది. సోషల్ మీడియా పోస్టులపై చర్యలు తీసుకోవాలంటూ ఏపీ పోలీసులు ఎక్స్‌కు పంపిన ఓ రిక్వెస్ట్‌లో అమెరికా దర్యాప్తు సంస్థ FBI (ఫెడ‌ర‌ల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్‌) పేరు ఉప‌యోగించుకోవ‌డంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పోస్టుల తొల‌గింపు రిక్వెస్ట్ అమెరికా FBI నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి వచ్చినట్లు ఎక్స్‌ గుర్తించింది.

గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయ అధికారిక ఈమెయిల్‌ నుంచి పోలీసు అధికారి ఏవీ బ్రహ్మం పేరుతో రిక్వెస్ట్ వచ్చినట్లు పేర్కొంటూ, అందులో సంస్థ పేరు వద్ద ‘FBI’ అని నమోదు చేయ‌డం సంచ‌ల‌నంగా మారింది. తొలుత FBI నుంచి ఫిర్యాదు వచ్చిందని భావించిన ఎక్స్‌.. లోతుగా ప‌రిశీలించ‌గా, అది ఆంధ్రప్రదేశ్ పోలీసుల నుంచి వచ్చిన రిక్వెస్ట్‌గా గుర్తించింది. అమెరికా FBIకి ఈ ఫిర్యాదుతో ఎలాంటి సంబంధం లేదని ఎక్స్‌ కూడా స్పష్టం చేసింది.

సోషల్ మీడియా పోస్టులను తొలగించాలంటూ ప్రభుత్వ సంస్థలు చేసే రిక్వెస్ట్‌ల విషయంలో సంస్థ పేరు, అధికారిక గుర్తింపు వంటి అంశాలు కీలకంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో పోలీసుల రిక్వెస్ట్‌లో FBI పేరు ఎలా వచ్చింది? అనే ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యవహారం బయటకు రావడంతో ఇలాంటి రిక్వెస్టులు ఇంకా ఎన్ని సోషల్ మీడియా ఖాతాలపై పంపారు? ఏయే పోస్టుల తొలగింపునకు కోరారు? వాటికి సంబంధించిన కేసులు, ఎఫ్‌ఐఆర్‌లు ఏమిటి? వంటి ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

ఇదే తరహాలో ‘తెలుగు ఫీడ్‌’కు కూడా గతంలో FBI పేరుతో నోటీసులు వచ్చింది. అమరావతిపై పూట‌కో మాట మార్చింది చంద్ర‌బాబు, ప‌వ‌న్ క‌ళ్యాణే అంటూ వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడిన వీడియోను పోస్టు చేసిన నేపథ్యంలో తెలుగు ఫీడ్‌కు FBI పేరుతో నోటీసులు ఇచ్చారు.

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పోలీసులు చంద్ర‌బాబు ప్రభుత్వ ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను ఫేస్‌బుక్‌, ఇన్‌స్టా వేదిక‌గా ప్ర‌శ్నిస్తున్న వారి అకౌంట్లను మెటాకు ఫిర్యాదు చేసి బ్లాక్ చేపించ‌డం, పోస్టులు క‌నిపించ‌కుండా చేయ‌డం, అదే ఎక్స్ అకౌంట్ అయితే ఆ పోస్టుల‌ను తొల‌గించాల‌ని FBI పేరుతో మెయిల్స్ పంపించి బెదిరింపుల‌కు గురిచేయ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అస‌లు ఏపీ పోలీసులు ఎక్స్‌కు రాసే త‌మ ఫిర్యాదులో ‘FBI’ అని ఎందుకు పేర్కొన్నారు? దీనికి ఎవరి అనుమతి ఉంది? సంబంధిత పోస్టులపై ఏదైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదైందా? ఏ చట్టంలోని సెక్షన్ల కింద చర్యలు కోరారు? ఇలాంటి రిక్వెస్టులు ఇంకా ఎన్ని ఖాతాలపై పంపారు? అనే అంశాలపై పోలీసు శాఖ స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

Join WhatsApp

Join Now

Leave a Comment