24 గంటల్లోనే జీవో మార్పు.. ఏపీలో మరో రిక్రూట్‌మెంట్‌పై అనుమానాలు

24 గంటల్లోనే జీవో మార్పు.. ఏపీలో మరో రిక్రూట్‌మెంట్‌పై అనుమానాలు

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో మరో ప్రభుత్వ ఉద్యోగ నియామక ప్రక్రియపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్ప‌టికే డీఎస్సీ ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటాలో జీవోలు మార్చి మంత్రి నారా లోకేష్ పాద‌యాత్ర‌లో పాల్గొన్న వారికి ఉద్యోగాలిచ్చార‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్న వేళ‌.. తాజాగా వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల పోస్టుల భర్తీ విషయంలో చంద్ర‌బాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. తొలుత ఈ నియామకాలను ఏపీపీఎస్సీ ద్వారా చేపట్టాలని నిర్ణయించిన ప్రభుత్వం.. 24 గంటలు గడవకముందే ఆ నిర్ణయాన్ని మార్చుకోవడంపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామకానికి ప్రభుత్వం తొలుత జీవో నంబర్‌ 21ను జారీ చేసింది. ఈ పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని అందులో పేర్కొన్నారు. అయితే పరీక్ష నిర్వహించకుండా మెరిట్‌ ఆధారిత విధానంలో నియామకాలు చేపట్టాలని చంద్ర‌బాబు ప్రభుత్వం నిర్ణయించింది.

ఏపీపీఎస్సీకి ఇచ్చినట్టే ఇచ్చి.. వెనక్కి!
తొలుత ఏపీపీఎస్సీ పరిధిలోకి తీసుకొచ్చిన ఈ నియామక ప్రక్రియను ఆ తర్వాత ప్రభుత్వం వెనక్కి తీసుకోవడం అనుమానాల‌కు తావిస్తోంది. జీవో 21 జారీ చేసిన 24 గంట‌ల్లోనే నిర్ణయాన్ని మార్చుకుంటూ జీవో నంబర్‌ 22ను జారీ చేసింది. దీంతో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామక బాధ్యతను మళ్లీ పశుసంవర్థక శాఖకే అప్పగించింది. పరీక్ష లేకుండా మెరిట్‌ ఆధారంగా నియామకాలు చేపట్టాల్సిన ప్రక్రియను ఏపీపీఎస్సీ నుంచి వెనక్కి తీసుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏపీపీఎస్సీకి అప్పగించిన నియామకాలను తిరిగి శాఖకు అప్పగించడం వెనుక కారణాలను ప్రభుత్వం స్పష్టం చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు.

దామోదర్‌ కొనసాగింపుపైనా విమర్శలు
ఇదిలా ఉంటే పశుసంవర్థక శాఖ డైరెక్టర్‌గా దామోదర్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈ నియామక ప్రక్రియపై మరిన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఆయనపై గతంలో వివాదాలు ఉన్నాయని, టీడీపీ వర్గానికి చెందిన అధికారిగా ఆయనకు ముద్ర ఉన్న‌ట్టుగా తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల నియామక బాధ్యతను అదే శాఖకు అప్పగించడం పట్ల కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పరీక్ష లేకుండా మెరిట్‌ ప్రాతిపదికన నియామకాలు చేపట్టే క్రమంలో తమకు అనుకూలమైన వారికి పోస్టులు కట్టబెట్టేందుకు అవకాశం ఉంటుందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సిందే..
ఏపీపీఎస్సీకి అప్పగించిన నియామకాలను కేవలం 24 గంటల్లోనే ఎందుకు వెనక్కి తీసుకున్నారు? జీవో 21లో పేర్కొన్న నిర్ణయాన్ని మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? పరీక్ష నిర్వహించకుండా మెరిట్‌ ఆధారంగా నియామకాలు చేపట్టాలని ఎందుకు నిర్ణయించారు? సెలక్షన్ కమిటీ కూర్పు ఎలా ఉంటుంది? వంటి అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment