ఆస్ట్రేలియా-ఏతో జరగనున్న హోమ్ సిరీస్‌కు భారత పురుషుల సెలక్షన్ కమిటీ ఇండియా-ఏ జట్లను ప్రకటించింది. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 11 వరకు జరిగే ఈ సిరీస్‌లో రెండు మల్టీ-డే మ్యాచ్‌లు, మూడు వన్డేలు ఉండనున్నాయి. సెప్టెంబర్ 22-25, సెప్టెంబర్ 29-అక్టోబర్ 2 తేదీల్లో మల్టీ-డే మ్యాచ్‌లు, అక్టోబర్ 6, 9, 11 తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి.
ఈ సిరీస్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం హార్దిక్ పాండ్యా రీఎంట్రీ. ఐపీఎల్ 2026 తర్వాత గాయాల కారణంగా పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్న పాండ్యాను ఇండియా-ఏ వన్డే జట్టులో ఎంపిక చేశారు. అయితే ఆయన ఆడటం పూర్తి ఫిట్‌నెస్ క్లియరెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. మల్టీ-డే మ్యాచ్‌లకు దేవదత్ పడిక్కల్ కెప్టెన్‌గా, సాయి సుదర్శన్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. వన్డే జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా, పడిక్కల్ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.
మల్టీ-డే జట్టులో అమన్ మోఖడే, ఆయుష్ పాండే, యశ్ రాథోడ్, షేక్ రషీద్, కుమార్ కుషాగ్ర, షామ్స్ ములానీ, తనుష్ కొటియాన్, తుషార్ దేశ్‌పాండే, అన్షుల్ కంబోజ్ తదితరులకు చోటు దక్కింది. వన్డే జట్టులో ప్రియాంశ్ ఆర్య, సాయి సుదర్శన్, రజత్ పటీదార్, నిషాంత్ సింధు, విప్రాజ్ నిగమ్, అర్షిన్ కులకర్ణి, నమన్ ధీర్, ప్రభ్‌సిమ్రన్ సింగ్ తదితరులు ఉన్నారు.








