మహిళల క్రికెట్ అభిమానులకు ఐసీసీ శుభవార్త అందించింది. తొలిసారిగా నిర్వహించనున్న ఐసీసీ మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ-2027 కు భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ టోర్నీ 2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు జరగనుండగా, ముంబైలోని బ్రాబోర్న్ స్టేడియం, వడోదర అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం మ్యాచ్‌లకు వేదికలు కానున్నాయి. తొలుత శ్రీలంకలో నిర్వహించాలని భావించిన ఈ టోర్నీని అక్కడి పరిపాలనా పరిస్థితుల నేపథ్యంలో భారత్‌కు మార్చారు.
తొలి ఎడిషన్‌లో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు పాల్గొంటాయి. జూలై 6 నాటి ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఈ ఆరు జట్లను ఎంపిక చేశారు. టోర్నీలో అన్ని జట్లు రౌండ్ రాబిన్ విధానంలో మిగతా జట్లతో తలపడతాయి. లీగ్ దశలో అత్యధిక పాయింట్లు సాధించిన రెండు జట్లు ఫిబ్రవరి 28న జరిగే ఫైనల్లో తలపడతాయి.
ఐసీసీ అధ్యక్షుడు జయ్ షా మాట్లాడుతూ.. 2027 మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ మహిళల క్రికెట్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని అన్నారు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్లు ఒకే వేదికపై పోటీపడటం ద్వారా మహిళల క్రికెట్‌కు మరింత ప్రాచుర్యం లభిస్తుందని ఐసీసీ పేర్కొంది. ఈ టోర్నీ ద్వారా జట్లు తమ అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌ను మెరుగుపరుచుకోవడంతో పాటు ప్రపంచ వేదికపై తమ స్థాయిని నిరూపించుకునే అవకాశం లభించనుంది.








