తెలంగాణ అధికార కాంగ్రెస్‌లో మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించినట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారానికి నేటితో తెరపడుతుందా? అనే చర్చ రాజకీయ వర్గాల్లో మొదలైంది.
మంత్రి కొండా సురేఖపై చర్యలకు క్రమశిక్షణ కమిటీ రూపొందించిన రిపోర్ట్ ఢిల్లీ పెద్దలకు చేరిన విషయం తెలిసిందే. కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు మాత్రమే కాకుండా గతంలో వివాదాలను సైతం క్రమశిక్షణ కమిటీ పరిగణనలోకి తీసుకొని కమిటీ రూపొందించింది. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేను కలిసిన కొండా సురేఖకు ఊహించని షాక్ తగిలింది. సాయంత్రం లోగా రాజీనామా చేయాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశించినట్లుగా సమాచారం.
కొండా సురేఖ స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు సీఎం రేవంత్‌రెడ్డి సిద్ధమవుతున్నట్లు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. మధ్యాహ్నం ఢిల్లీ నుంచి సీఎం హైదరాబాద్‌కు తిరిగి రానున్న నేపథ్యంలో సురేఖ రాజీనామా ప్రకటన చేయకపోతే.. ఆమెను మంత్రి పదవి నుంచి తొలగించాలని కోరుతూ గవర్నర్‌కు సీఎం లేఖ పంపే అవకాశం ఉందనే కాంగ్రెస్ వర్గాల సమాచారం.
తాజా పరిణామాలపై మంత్రి కొండా సురేఖ ఢిల్లీలో మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. తనపై చర్యలు తీసుకుంటే బీసీలు ఏకమవుతారని, తన కుమార్తె చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాలిని చేయడం సరికాదని సురేఖ పేర్కొన్న విషయం తెలిసిందే. అలాగే సీఎం రేవంత్‌రెడ్డిపై కూడా ఆమె తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
తాజా పరిణామాల నేపథ్యంలో కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పిస్తారా? ఆమె స్వయంగా రాజీనామా చేస్తారా? అనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. సాయంత్రంలోగా రాజీనామా ప్రకటన రాకపోతే బర్తరఫ్ లేఖను గవర్నర్‌కు పంపించే అవకాశం ఉందనే ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.








