ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలకు ఏర్పాట్లు మొదలయ్యాయి. ఈ ఏడాది దసరా మహోత్సవాలను అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇంద్రకీలాద్రిపై బోర్డు ఛైర్మన్ బొర్రా రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన పాలకమండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. ఈ సందర్భంగా 10 రోజుల పాటు కనకదుర్గమ్మ వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు.
దసరా ఉత్సవాల్లో భాగంగా అక్టోబర్ 11న బాలా త్రిపురసుందరీ దేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. అనంతరం వరుసగా వివిధ అలంకారాల్లో అమ్మవారిని దర్శించుకునే అవకాశం భక్తులకు కల్పించనున్నారు.
- అక్టోబర్ 11న బాలా త్రిపురసుందరీ దేవి
- 12న గాయత్రీ దేవి
- 13న అన్నపూర్ణాదేవి
- 14న మహాచండీ దేవి
- 15న లలితా త్రిపుర సుందరీ దేవి
- 16న సరస్వతి దేవి (మూలా నక్షత్రం)
- 17న మహాలక్ష్మీ దేవి
- 18న దుర్గాదేవి (దుర్గాష్టమి)
- 19న మహిషాసుర మర్ధిని దేవి (మహర్నవమి)
- 20న రాజరాజేశ్వరి దేవి (విజయదశమి)
మూలా నక్షత్రం, విజయదశమికి ప్రత్యేక ప్రాధాన్యత
దసరా మహోత్సవాల్లో అక్టోబర్ 16న మూలా నక్షత్రం సందర్భంగా సరస్వతి దేవి అలంకారంలో అమ్మవారు దర్శనమివ్వనున్నారు. అక్టోబర్ 18న దుర్గాష్టమి సందర్భంగా దుర్గాదేవి అలంకారం, 19న మహర్నవమి సందర్భంగా మహిషాసుర మర్ధిని దేవి అలంకారం నిర్వహించనున్నారు.
ఉత్సవాల చివరి రోజైన అక్టోబర్ 20న విజయదశమి సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమివ్వనున్నారు. 20వ తేదీ సాయంత్రం కృష్ణానదిలో హంసవాహన తెప్పోత్సవం కార్యక్రమం నిర్వహించనున్నారు. దసరా ఉత్సవాలకు భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండటంతో ఆలయ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేయనున్నారు.








