చంద్రబాబు సభలో పారిశుద్ధ్య కార్మికుడు దుర్మరణం

చంద్రబాబు సభలో పారిశుద్ధ్య కార్మికుడు దుర్మరణం

Summarize with AI

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాడుగుల నియోజకవర్గం ఏ.కోడూరులో పర్యటన సందర్భంగా విషాద ఘటన చోటుచేసుకుంది. సీఎం సభ జరుగుతున్న సమయంలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు దడాల వీరబాబు మృతి చెందారు. పాయకరావుపేట నుంచి విధుల నిర్వహణ కోసం వచ్చిన వీరబాబు సభా ప్రాంగణంలోనే కుప్ప‌కూలి ప్రాణాలు కోల్పోయాడు.

అయితే వీరబాబు మృతి విషయాన్ని సీఎం పర్యటన పూర్తయ్యే వరకు అధికారులు గోప్యంగా ఉంచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పర్యటన ముగిసిన అనంతరం వీరబాబు మృతదేహాన్ని కే.కోటపాడు ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.

వీరబాబు మృతదేహానికి హడావుడిగా పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం ఆయన స్వగ్రామానికి తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సీఐటీయూ నేతలు ఆరోపిస్తున్నారు. సభలో విధులు నిర్వహిస్తూ కార్మికుడు మృతి చెందిన నేపథ్యంలో ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను వెల్లడించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

వీరబాబు మృతికి గల కారణాలపై సమగ్ర విచారణ జరపాలని, విధుల్లో ఉన్న సమయంలో చోటుచేసుకున్న ఘటనపై ప్రభుత్వం బాధ్యత వహించాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. వీరబాబు కుటుంబాన్ని ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడంతో పాటు రూ.50 లక్షల నష్టపరిహారం అందించాలని కోరింది.

వీరబాబు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని సీఐటీయూ నేత వీవీ శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ప్రభుత్వం తక్షణమే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సీఎం సభలో విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోక‌పోవ‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

Join WhatsApp

Join Now

Leave a Comment