ముఖ్యమంత్రి(CM) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) అధ్యక్షతన సచివాలయంలో(Secretariat) జరిగిన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) మంత్రివర్గ సమావేశంలో (Cabinet Meeting) 30కి పైగా అజెండా అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. అయితే సమావేశంపై చర్చంతా ప్రభుత్వ నిర్ణయాల కంటే, ఐదుగురు మంత్రుల గైర్హాజరుపైనే ఎక్కువగా సాగుతోంది.
అత్యంత కీలకమైన కేబినెట్ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మరోసారి డుమ్మా కొట్టడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. గత రెండు కేబినెట్ సమావేశాల్లోనూ పవన్ కళ్యాణ్ అనారోగ్య కారణాలతో మధ్యలోనే వెళ్లిపోయారు. ఇవాళ కూడా అనారోగ్య కారణాలతో ముంబై (Mumbai) వెళ్లాల్సి రావడంతో ఆయన సమావేశానికి రాలేదని జనసేన(Jana Sena) వర్గాలు వెల్లడిస్తున్నాయి. గతంలో ముక్కు శస్త్ర చికిత్స, వెన్నునొప్పితో హాజరుకాలేకపోయిన విషయం తెలిసిందే.
ఇక మంత్రి నారా లోకేష్(Nara Lokesh) దక్షిణ కొరియా పర్యటనలో ఉండగా, టీజీ భరత్ (TG Bharath) అమెరికా పర్యటనలో, నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) బెంగళూరు పర్యటనలో ఉన్నారు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ (Kondapalli Srinivas) కేంద్ర మంత్రి పర్యటన నేపథ్యంలో తిరుపతిలో ప్రోటోకాల్ విధుల్లో ఉండటంతో కేబినెట్‌కు హాజరు కాలేదు.
అయితే, ప్రభుత్వం ఎదుర్కొంటున్న కీలక పరిపాలనా అంశాలపై చర్చించే మంత్రివర్గ సమావేశానికి ఒకేసారి ఐదుగురు మంత్రులు దూరంగా ఉండడంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ముందస్తు ప్రణాళికతో పర్యటనలు, ఇతర కార్యక్రమాలను సమన్వయం చేసుకుని మంత్రివర్గ సమావేశానికి పూర్తి స్థాయిలో హాజరు కావాల్సిన బాధ్యత మంత్రులపై ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రత్యేకించి ఉప ముఖ్యమంత్రి వరుసగా కేబినెట్ సమావేశాలకు పూర్తిస్థాయిలో హాజరు కాకపోవడం సహజంగానే చర్చకు దారితీస్తోంది. అయితే ప్రభుత్వం మాత్రం గైర్హాజరైన ప్రతి మంత్రికి అధికారిక కారణాలు ఉన్నాయని, వాటి వల్లే వారు సమావేశానికి హాజరు కాలేకపోయారని చెబుతోంది.







