రెండేళ్ల కూటమి పాలన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికరమైన మార్పులు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షంతో రాజకీయంగా తలపడటమే కాకుండా, కూటమిలోని మిత్రపక్షాలను కూడా తన రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా నడిపించడంలో చంద్రబాబు తనదైన శైలిని ప్రదర్శిస్తున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. తాజాగా యూట్యూబర్ రావణ్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు ఈ రాజకీయ వ్యూహానికి తాజా ఉదాహరణగా నిలుస్తున్నాయని వైసీపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
ఒకవైపు రావణ్ వ్యాఖ్యలను మతంతో ముడిపెట్టి, వాటిని వైసీపీకి ఆపాదించడం… మరోవైపు రావణ్‌కు వ్యతిరేకంగా జనసేన కార్యకర్తలు చేసిన ఆందోళనలు, పోలీస్‌స్టేషన్ల వద్ద చోటుచేసుకున్న ఘటనల ద్వారా ఆ పార్టీకి నెగెటివ్ ఇమేజ్ ఏర్పడేలా చేయడం… ఈ రెండు పరిణామాల మధ్య చంద్రబాబు, లోకేష్ మాత్రం బాధ్యతాయుతమైన నాయకులుగా కనిపించేలా రాజకీయ స్క్రీన్‌ప్లే నడుస్తోందన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
బనగానపల్లె వేదికగా బయటపడిన ప్రభుత్వ పాత్ర?
బనగానపల్లె సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రావణ్ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. రావణ్‌పై నమోదైన కేసులు, అరెస్టులు, యూఏపీఏ ప్రయోగం వంటి పరిణామాలపై ఆయన చేసిన వ్యాఖ్యలు పలు ప్రశ్నలకు దారితీశాయి. రావణ్ వ్యవహారంలో పోలీసులు చేపట్టిన చర్యలు ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగాయా? ముఖ్యమంత్రి వ్యాఖ్యల ద్వారా పోలీసు చర్యల వెనుక రాజకీయ నిర్ణయం ఉందన్న సందేశం వెళ్లలేదా? అనే ప్రశ్నలు ఇప్పుడు ముందుకొస్తున్నాయి.
రావణ్ వ్యాఖ్యలు మత విద్వేషాలను రెచ్చగొట్టేవిగా ఉన్నాయని చెప్పడంతోపాటు, అలాంటి వ్యక్తిని వైసీపీ సమర్థిస్తోందని చంద్రబాబు ఆరోపించారు. దీనిద్వారా తాను హిందూ మత పరిరక్షకుడిగా కనిపిస్తూ, వైసీపీపై మత వ్యతిరేక ముద్ర వేయడానికి ప్రయత్నించారన్నది ఆ పార్టీ వాదన. టీడీపీ అనుకూల మీడియా, సోషల్‌మీడియా వేదికల్లో కూడా ఇదే కోణంలో ప్రచారం సాగడం యాదృచ్ఛికం కాదని వైసీపీ నేతలు అంటున్నారు.
రావణ్ ఇష్యూపై స్పందించిన చంద్రబాబు
— Telugu Feed (@Telugufeedsite) July 9, 2026
రావణ్ అనే వ్యక్తి, పురాణాలను దూషించాడు అంటూ బహిరంగ సభలో కామెంట్స్
రావణ్‌కు వైసీపీ ఆర్థిక సహాయం చేస్తోందని సీఎం ఆరోపణలు
పవన్‌ను ఎదిరించడానికి టీడీపీ పెంచిపోషిస్తున్న మొక్కే రావణ్ అంటున్న వైసీపీ https://t.co/8x0dBYik93 pic.twitter.com/P0ig9MOSZe
వ్యక్తికి మద్దతా? రాజ్యాంగ హక్కుల పరిరక్షణా?
రావణ్ అనే వ్యక్తి చేసిన ప్రతి వ్యాఖ్యను తాము సమర్థించడం లేదని వైసీపీ ఇప్పటికే స్పష్టం చేసింది. అయితే ఒక వ్యక్తిపై వరుస కేసులు నమోదు చేయడం, కోర్టులు బెయిల్ మంజూరు చేసిన తర్వాత కూడా మరో కేసులో అరెస్టు చేయడం, చివరకు యూఏపీఏ వంటి కఠిన చట్టాన్ని ప్రయోగించడం రాజ్యాంగబద్ధ పాలనా విధానానికి విరుద్ధమని ప్రశ్నిస్తోంది.“మా అభ్యంతరం వ్యక్తి గురించి కాదు. ప్రభుత్వం అనుసరిస్తున్న నిరంకుశ విధానం గురించి. భావప్రకటనకు సంబంధించిన ఆరోపణలకు సాధారణ చట్టాలు ఉండగా, యూఏపీఏ వంటి చట్టాన్ని ఎందుకు ప్రయోగించారు?” అన్నదే వైసీపీ ప్రధాన ప్రశ్న. దీన్ని రావణ్‌కు వ్యక్తిగత మద్దతుగా చిత్రీకరించి, వైసీపీపై మతపరమైన ముద్ర వేయడం చంద్రబాబు రాజకీయ వ్యూహంలో భాగమని ఆ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ ను ఎదిరించడానికి టీడీపీ పెంచిన మొక్కే రావణ్
— Telugu Feed (@Telugufeedsite) July 7, 2026
రావణ్ టీడీపీకి చెందిన వ్యక్తి అని టీడీపీలోనే చర్చ జరుగుతోంది
రావణ్ వైసీపీకి చెందిన వ్యక్తే అయితే.. మాకు వ్యతిరేకంగా ఎన్ని పోస్టులు పెట్టాడో మీరే చూడండి
మేము ప్రశ్నించేది చంద్రబాబు ప్రభుత్వ రాజ్యాంగ ఉల్లంఘన మీద..… pic.twitter.com/3JplGfU2oZ
జనసేనకు నష్టం… చంద్రబాబుకు లాభం?
రావణ్ ఎపిసోడ్‌లో అత్యధిక రాజకీయ నష్టం జనసేనకే జరిగిందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. రావణ్‌పై కేసులు నమోదై, అరెస్టు జరిగి, వ్యవహారం న్యాయస్థానాల పరిధిలో ఉన్న సమయంలో కూడా కొందరు జనసేన కార్యకర్తలు పోలీస్‌స్టేషన్ల వద్ద ఆందోళనలకు దిగడం, దాడులకు పాల్పడ్డారనే ఆరోపణలు రావడం ఆ పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీశాయి. చట్టపరమైన ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు పోలీస్‌స్టేషన్లపై విరుచుకుపడటం, అక్కడ ప్రదర్శించిన తీరు కారణంగా జనసేనపై “అల్లరి పార్టీ”, “చిల్లర రాజకీయాల పార్టీ”, “ఉన్మాద ధోరణితో వ్యవహరిస్తున్న పార్టీ” అన్న విమర్శలు రావడానికి అవకాశం ఏర్పడింది.
ఈ ఘటనలను పోలీసులు ముందుగానే ఎందుకు నియంత్రించలేకపోయారు? ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నా ప్రభుత్వ పెద్దలు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఈ పరిణామాలతో జనసేనకు నష్టం జరుగుతుందని తెలిసినా టీడీపీ నాయకత్వం ఎందుకు జోక్యం చేసుకోలేదు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. జనసేన కార్యకర్తల ముసుగులో టీడీపీ సానుభూతిపరులు చేరి పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేశారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఇందులో నిజానిజాలు దర్యాప్తులో తేలాల్సి ఉన్నప్పటికీ, మొత్తం పరిణామంలో రాజకీయంగా నష్టపోయింది పవన్‌కళ్యాణ్ మాత్రమేనన్న భావన బలపడుతోంది.
సాయికృష్ణ కేసులోనూ అదే వ్యూహం
విజయవాడ కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌కు సంబంధించిన సాయికృష్ణ లాకప్‌డెత్, మృతదేహం మాయం ఆరోపణల వ్యవహారంలో కూడా ఇదే రాజకీయ వ్యూహం కనిపించిందని వైసీపీ చెబుతోంది. లా అండ్ ఆర్డర్ నేరుగా ముఖ్యమంత్రి పరిధిలో ఉంటుంది. హోంమంత్రి టీడీపీకి చెందినవారు. డీజీపీ నుంచి పోలీసు యంత్రాంగం వరకు ప్రభుత్వ నియంత్రణలోనే పనిచేస్తుంది. అందువల్ల సాయికృష్ణ కేసులో సమాధానం చెప్పాల్సిన ప్రధాన బాధ్యత ముఖ్యమంత్రి, హోంమంత్రిపైనే ఉంటుంది. కానీ ఈ వ్యవహారంలో సమాధానం చెప్పాల్సిన చంద్రబాబు తెరవెనుక ఉండిపోయి, పవన్‌కళ్యాణ్‌ను రాజకీయ వివాదంలో ముందుకు నెట్టారన్న విమర్శలు వచ్చాయి. ఫలితంగా ప్రభుత్వంపై రావాల్సిన వ్యతిరేకతలో ఎక్కువభాగం పవన్‌కళ్యాణ్, జనసేన వైపు మళ్లిందని రాజకీయ పరిశీలకులు పేర్కొంటున్నారు. రావణ్ వ్యవహారంలోనూ ఇదే పద్ధతి పునరావృతమైందా? ప్రభుత్వ చర్యలకు రాజకీయంగా చంద్రబాబు లాభపడుతూ, దుష్పరిణామాలను మాత్రం పవన్‌కళ్యాణ్ మోయాల్సి వస్తోందా? అనే చర్చ ఇప్పుడు కూటమి వర్గాల్లోనూ మొదలైనట్లు తెలుస్తోంది.
గాదె సాయికృష్ణ కేసుపై స్పందించిన పవన్ కళ్యాణ్
— Telugu Feed (@Telugufeedsite) June 20, 2026
క్రిమినల్ కి కులాలు ఉండవు, క్రిమినల్స్ ని కుల కోణాల్లో చూడకండి
అలాంటి నీచులను మనం వెనకేసుకొస్తే.. బాగుండదు
– పవన్ కళ్యాణ్ https://t.co/IVMtccDlSC pic.twitter.com/JOCXEwf8jT
రావణ్ అసలు ఎవరి రాజకీయాలకు దగ్గర?
రావణ్ ఎవరి మనిషి? గతంలో ఎవరికి అనుకూలంగా మాట్లాడారు? ఎవరిని ప్రధానంగా విమర్శించారు? అనే అంశాలను వైసీపీ ఇటీవల ప్రజల ముందుకు తీసుకొచ్చింది. వైఎస్ జగన్ ప్రభుత్వంపై రావణ్ గతంలో తీవ్ర విమర్శలు చేయడం, అదే సమయంలో చంద్రబాబు, బాలకృష్ణ, లోకేష్‌లపై పలు సందర్భాల్లో సానుకూలంగా మాట్లాడటం, తాను పవన్‌కళ్యాణ్‌ను మాత్రమే విమర్శిస్తానని చెప్పినట్లు ప్రచారంలో ఉన్న వీడియోలు ఇప్పుడు రాజకీయంగా హాట్‌టాపిక్‌గా మారాయి. ఈ నేపథ్యంలో రావణ్‌ను వైసీపీ వ్యక్తిగా చిత్రీకరించడం వెనుక రాజకీయ ఉద్దేశం ఏమిటన్న ప్రశ్నను ఆ పార్టీ లేవనెత్తుతోంది. రావణ్‌తో రాజకీయంగా ఎవరు దగ్గరగా ఉన్నారనే అంశం ఒకటైతే, ఆయనపై ప్రభుత్వం ప్రయోగించిన చట్టాలు రాజ్యాంగబద్ధమా కాదా అన్నది మరో అంశమని వైసీపీ స్పష్టం చేస్తోంది. ఈ రెండింటినీ కలిపి, తమ పార్టీపై మతపరమైన ముద్ర వేయడం రాజకీయ దురుద్దేశమేనని ఆరోపిస్తోంది.

వైసీపీ సంయమనం… పవన్ ఆవేశం
రావణ్ వ్యవహారంలో వైసీపీ ప్రారంభం నుంచే వ్యక్తిగత వ్యాఖ్యల జోలికి వెళ్లకుండా, ప్రభుత్వ అధికార దుర్వినియోగం, భావప్రకటన స్వేచ్ఛ, యూఏపీఏ ప్రయోగం వంటి రాజ్యాంగబద్ధ అంశాలకే పరిమితమైందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో పవన్‌కళ్యాణ్ చంద్రబాబు రాజకీయ ఎత్తుగడను గుర్తించకుండా భావోద్వేగపూరితంగా స్పందించడంతో జనసేన మరింత ఇబ్బందుల్లో పడిందన్న విశ్లేషణలు వస్తున్నాయి. ఒకవైపు వైసీపీని మత వ్యతిరేక పార్టీగా చూపించడం, మరోవైపు జనసేనను అల్లరి, ఆవేశపూరిత పార్టీగా ప్రజల ముందు నిలబెట్టడం, చివరకు తాను, తన కుమారుడు లోకేష్ మాత్రమే పరిణతి చెందిన నాయకులన్న భావన సృష్టించుకోవడం.. ఇదే మొత్తం ఎపిసోడ్ వెనుక చంద్రబాబు రాజకీయ వ్యూహమని వైసీపీ ఆరోపిస్తోంది.
చంద్రబంధంలో జనసేన?
కూటమిలో అధికార ప్రయోజనాలు టీడీపీకి… వివాదాల భారం జనసేనకు అన్నట్టుగా పరిస్థితి మారుతోందా? ప్రభుత్వ నిర్ణయాలకు చంద్రబాబు క్రెడిట్ తీసుకుంటూ, ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అంశాల్లో పవన్‌కళ్యాణ్‌ను ముందుకు నెడుతున్నారా? అనే ప్రశ్నలు తాజా పరిణామాలతో మరింత బలపడుతున్నాయి. సాయికృష్ణ కేసులోనూ, రావణ్ వ్యవహారంలోనూ చంద్రబాబు రాజకీయంగా వెనుక ఉండి, పవన్‌కళ్యాణ్‌ను ముందుపెట్టారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. చంద్రబాబు రాజకీయ చక్రబంధాన్ని పవన్‌కళ్యాణ్ ఇప్పటికైనా గుర్తిస్తారా? లేక ప్రతి వివాదంలోనూ జనసేన నెగెటివ్ ఇమేజ్‌ను మోస్తూ, రాజకీయ లాభాన్ని టీడీపీకి అప్పగిస్తుందా? అన్నది రానున్న రోజుల్లో తేలనుంది.








