కూటమి పార్టీల మధ్య విభేదాలు మరోసారి భగ్గమంటున్నాయి. జనసేన ఎమ్మెల్యేలు(Jana Sena MLAs) తమకు విలువ ఇవ్వడం లేదని టీడీపీ(TDP) నాయకులు, టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నచోట జనసేనకు సరైన గౌరవం దక్కడం లేదని ఇరుపార్టీల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. తాజాగా, పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం జనసేన (Jana Sena) ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్‌ను (Bolisetti Srinivas) లక్ష్యంగా చేసుకుని టీడీపీ నియోజకవర్గ ఇంచార్జి వలవల బాబ్జి (Valavala Babji) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జనసేన కూటమి ధర్మాన్ని పాటించలేదని ఆరోపిస్తూ ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తాను ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ(TDP) క్రమశిక్షణకు కట్టుబడి ఓర్పుతో వ్యవహరిస్తున్నానని, అయినా పదేపదే తనను లక్ష్యంగా చేసుకుని అనుచిత వ్యాఖ్యలు చేయడం వల్ల బాధ కలుగుతోందన్నారు టీడీపీ ఇన్చార్జ్ బాబ్జి. ఇంతకాలం పార్టీ క్రమశిక్షణను గౌరవించి మౌనంగా ఉన్నానని, కానీ అవసరమైతే తాను కూడా మాట్లాడాల్సి వస్తుందని హెచ్చరించారు.
“నేను నోరు విప్పి మాట్లాడడం మొదలు పెడితే మీరు తలలు దించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది” అంటూ బాబ్జి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ (Bolisetti Srinivas) మాట్లాడుతూ “టీడీపీ క్యాడర్ అంతా నాతోనే ఉంది.. నాయకుడు తప్ప” అని వ్యాఖ్యానించారని, నియోజకవర్గంలో తమకు గౌరవం లేకుండా జనసేన ఎమ్మెల్యే చేస్తున్నారని ఆరోపించారు.
కూటమి అంటే కూటమిలాగే వ్యవహరించాలని, భాగస్వామ్య పక్షాలను గౌరవించే విధంగా నడుచుకోవాలని ఆయన జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టికి సూచించారు. కూటమి ధర్మాన్ని పక్కనపెట్టి పలుమార్లు తనను అవమానించేలా మాట్లాడారని ఆరోపించారు. ఇకపై తనపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేస్తే తాను కూడా తగిన విధంగా స్పందిస్తానని హెచ్చరించారు.
చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని వర్సెస్ జనసేన, తాడేపల్లిగూడెంలో టీడీపీ-జనసేన(TDP-Jana Sena) ఎమ్మెల్యే మధ్య కొనసాగుతున్న అంతర్గత విభేదాలు ఇప్పుడు బహిరంగ వ్యాఖ్యల రూపంలో బయటపడటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పరిణామాలపై కూటమి పెద్దలు ఎలా స్పందిస్తారనేది ఆసక్తికరంగా మారింది.








