ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) ఐఏఎస్(IAS), ఐపీఎస్(IPS) వర్గాల్లో జూన్ నెల ముగింపు అత్యంత ఆసక్తికర పరిణామాలకు వేదికవుతోంది. ఇద్దరు సీనియర్ అధికారులు ఒకే రోజు (జూన్ 30న) పదవీ విరమణ (Retirement) చేస్తుండటం, వారి పట్ల కూటమి ప్రభుత్వం (Coalition Government) అనుసరిస్తున్న వ్యూహాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సీనియర్ ఐఏఎస్ అధికారిణి వై.శ్రీలక్ష్మికి (Y. Srilakshmi)పదవీ విరమణకు కేవలం నాలుగు రోజుల ముందు పోస్టింగ్ ఇచ్చి గౌరవప్రదమైన వీడ్కోలుకు మార్గం సుగమం చేసిన చంద్రబాబు సర్కార్ (Nara Chandrababu Naidu).. మరి సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ (PV Sunil Kumar) విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోందనే సస్పెన్స్ కొనసాగుతోంది.
గత వైసీపీ ప్రభుత్వంలో (YSRCP Government) కీలక బాధ్యతలు నిర్వహించి, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లూప్ లైన్‌లో (Loop Line) ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మికి (Y. Srilakshmi) ఎట్టకేలకు పోస్టింగ్ దక్కింది. పదవీ విరమణకు సరిగ్గా నాలుగు రోజుల ముందు ఆమెను సాధారణ పరిపాలన శాఖ (GAD) లోని జి.పి.ఎమ్ అండ్ ఏఆర్ (GPM & AR) విభాగంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 30న ఆమె రిటైర్ కానుండటంతో, సర్వీస్ ముగిసే సమయంలో గౌరవప్రదంగా ఉద్యోగ విరమణ చేశామన్న ఆత్మసంతృప్తిని కల్పించినట్లయింది.
మరోవైపు, సీనియర్ ఐపీఎస్ అధికారి పీవీ సునీల్‌కుమార్ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పర్యటనలకు వెళ్లారన్న అభియోగాలపై 2025 మార్చి 2న ఆయనపై ప్రభుత్వం మొదటిసారి సస్పెన్షన్ వేటు వేసింది. ఆ తర్వాత డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు (Raghurama Krishnam Raju)ను గతంలో కస్టడీలో హింసించారనే నెపంతో సునీల్‌కుమార్ సస్పెన్షన్‌ను పదవీ విరమణ తేదీ వరకు పొడిగిస్తూ ఫిబ్రవరిలోనే ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది.
డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు, పీవీ సునీల్‌కుమార్‌కు మధ్య ఉన్న వ్యక్తిగత, రాజకీయ వైరం అందరికీ తెలిసిందే. కస్టోడియల్ టార్చర్ (Custodial Torture) కేసులో సునీల్‌కుమార్‌ను ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంపై రఘురామ తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో, సునీల్‌కుమార్‌కు పోస్టింగ్ ఇస్తే ఆయనపై ఉన్న ఆరోపణలు, కేసుల తీవ్రత తగ్గిపోతుందనే భావన ప్రభుత్వ పెద్దల్లో ఉంది. సస్పెన్షన్‌లోనే ఆయనను ఇంటికి సాగనంపడం ద్వారా రఘురామకృష్ణరాజును కొంతవరకైనా సాటిస్‌ఫై చేసినట్లు అవుతుందనే విశ్లేషణలు నడుస్తున్నాయి.
మరోవైపు పీవీ సునీల్‌కుమార్ సైతం తగ్గేదే అంటున్నట్లు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. గతంలో వైఎస్ జగన్ (Y. S. Jagan Mohan Reddy) ప్రభుత్వం (Government) సైతం తీవ్ర విభేదాలున్న ఏబీ వెంకటేశ్వరరావును (A. B. Venkateswara Rao) గౌరవంగానే రిటైర్ అవ్వనిచ్చిందని, మరి ఇక్కడి ప్రభుత్వం ఏం చేస్తుందో చూద్దాం అంటూ ఆయన పరోక్ష సవాల్ విసిరారు.
పదవీ విరమణకు కేవలం మూడు రోజులు మాత్రమే సమయం ఉండటంతో, కూటమి ప్రభుత్వం సునీల్‌కుమార్ సస్పెన్షన్‌ను ఎత్తివేసే సూచనలు కనిపించడం లేదు. ఒకవేళ సస్పెన్షన్‌లోనే ఆయన రిటైర్ అయితే, తదుపరి ఆయన స్పందన, చట్టపరమైన పోరాటం ఏ రకంగా ఉండబోతోందనేది ఐపీఎస్ వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది








