ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాజకీయాల్లో అత్యంత కీలకమైన సామాజిక వర్గ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమయంలో కూటమి విజయానికి వెన్నుదన్నుగా నిలిచిన కాపు సామాజిక వర్గం (Kapu Community) . ఇప్పుడు అదే కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు(Pawan Kalyan) వ్యతిరేకంగా ఏకమవుతోంది. వైసీపీ(YSRCP) సీనియర్ నేత, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు (Thota Trimurthulu) ఆధ్వర్యంలో రేపు జరగబోయే కాపు సామాజిక వర్గ నేతల అత్యవసర భేటీ ఇప్పుడు కూటమి పార్టీల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశానికి వైసీపీలోని కాపు నేతలతో పాటు, ఇటీవల జనసేన(Jana Sena), కూటమిపై అసమ్మతి గళం వినిపిస్తున్న పలువురు కీలక నేతలు కూడా హాజరయ్యే ఛాన్స్ ఉన్నట్టుగా టాక్.
గత ఎన్నికల సమయంలో “కనీసం కుల భావన అయినా తెచ్చుకొని నన్ను, నా పార్టీని గెలిపించండి” అని పవన్ కల్యాణ్ స్వయంగా కాపు సామాజిక వర్గాన్ని వేడుకున్నారు. తమ వర్గం నుంచి ఒక బలమైన నాయకుడు ఎదుగుతాడని, సమాజంలో తమకు గౌరవ మర్యాదలు దక్కుతాయని భావించిన కాపులు జనసేనకు, కూటమికి ఏకపక్షంగా మద్దతు ప్రకటించారు. కానీ, అధికారం సాధించిన రెండేళ్లలోనే సీన్ పూర్తిగా రివర్స్ అయింది.
కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా కాపు సామాజిక వర్గ నేతలు, కార్యకర్తలపై టీడీపీ(TDP) దాడులు పెరిగిపోయాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ప్రభుత్వ పనుల్లో గానీ, పదవుల పంపకాల్లో గానీ, చివరికి నియోజకవర్గాల్లో పరపతి విషయంలో గానీ కాపులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని ఆ సామాజిక వర్గ నేతలు బహిరంగంగానే ఆవేదన చెందుతున్నారు. ఇంత విసుగుపాటులో మరో 15 సంవత్సరాలు కలిసే ఉండాలన్న పవన్ నినాదం వారికి అసలు రుచించడం లేదు.
ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ కోసం కాపు సామాజిక వర్గాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషించిన దాసరి రాము.. ఇటీవల పవన్ తీరుపై తిరుగుబాటు జెండా ఎగురవేయడం పెద్ద సంచలనమే సృష్టించింది. పవన్ కల్యాణ్ కేవలం చంద్రబాబు(Nara Chandrababu Naidu) ప్రయోజనాల కోసమే పనిచేస్తున్నారని, కాపుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని దాసరి రాము లాంటి నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
ఆ తరువాత పవన్ పార్టీకి చెందిన కొందరు నేతలు దాసరి రాము(Dasari Ramu) పేరు చెబుతూ దాడులు చేస్తామని బెదిరించడంతో ఆక్రోశం తీవ్రమైంది. పవన్ కల్యాణ్ వైఖరితో విసిగిపోయిన మెజార్టీ కాపు నేతలు ఇప్పుడు ప్రత్యామ్నాయంగా వైసీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల వైఎస్ జగన్(YS Jagan Mohan Reddy) సమక్షంలో వైసీపీలో చేరిన జనసేన కాపు నేత గంగా సురేష్(Ganga Suresh), అతని సన్నిహితుల బాటలోనే మరికొందరు కీలక నేతలు పయనించేందుకు సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.
‘తోట త్రిమూర్తులు’ గెట్ టుగెదర్.. వ్యూహం ఏంటి?
కాపులంతా ప్రభుత్వం మీద, తాము నమ్ముకున్న నాయకుడు పవన్ కల్యాణ్ మీద తీవ్ర ఆగ్రహంతో రగులుతున్న సమయంలో తోట త్రిమూర్తులు గెట్ టుగెదర్ ఏర్పాటు చేసి వైసీపీలోని కాపు నాయకులందరికీ ఫోన్లు చేసి ఆహ్వానిస్తున్నారు. రేపు జరగబోయే ఈ భేటీ రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.
“ఇన్నాళ్లూ అధికార కూటమిలో ఉండి, ఆ వాతావరణంలో పొసగలేక బయటకు వచ్చిన కాపు నాయకులందరి చూపు కూడా ఈ సమావేశంపై ఉన్నట్టుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్ కాపులను కేవలం ఓటు బ్యాంకులానే వాడుకున్నారనే నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఈ వేదిక ద్వారా ఒక బలమైన కార్యాచరణను రూపొందించబోతున్నట్టు సమాచారం.
జనసేన నుంచి కాపులు మెల్లమెల్లగా బయటపడుతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకవైపు సొంత సామాజిక వర్గం నుంచే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటం, మరోవైపు వైసీపీ ఈ అసంతృప్తిని క్యాష్ చేసుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో జనసేన పార్టీ ఆత్మరక్షణలో పడింది. రేపటి తోట త్రిమూర్తులు మీటింగ్‌కు ఎవరెవరు హాజరవుతారో..? ఈ సమావేశం ఏపీ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందో చూడాలి.







