‘ఆ 40 రోజులు సీపీ ఏం చేశారు?’ పేర్ని నాని సంచలన ప్రశ్నలు

'ఆ 40 రోజులు సీపీ ఏం చేశారు?' పేర్ని నాని సంచలన ప్రశ్నలు

విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సంచలనం సృష్టించిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ మిస్టరీ, దళిత యువకుడు క్రాంతికుమార్ ఆత్మహత్య ఘటనలపై వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ రెండు ఘోరాలకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర బాబు ప్రత్యక్షంగా బాధ్యత వహించాలని ఆయన డిమాండ్ చేశారు. కింది స్థాయి అధికారులను బలిపశువులను చేసి పెద్ద తలకాయలను రక్షించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. ప్రభుత్వం, పోలీస్ బాస్‌ల తీరును ఎండగడుతూ సంచలన ప్రశ్నలను సంధించారు పేర్ని నాని.

టాస్క్‌ఫోర్స్ చర్యలకు సీపీ బాధ్యత లేదా?
మార్కాపురం నుంచి సాయికృష్ణను అక్రమంగా విజయవాడకు తీసుకువచ్చింది టాస్క్‌ఫోర్స్ పోలీసులు. టాస్క్‌ఫోర్స్ విభాగం నేరుగా విజయవాడ సీపీ పరిధిలోనే పనిచేస్తుంది. మరి సీపీకి తెలియకుండానే టాస్క్‌ఫోర్స్ ఇంత పెద్ద ఆపరేషన్ చేసిందా? కమిషనర్ మార్గదర్శకత్వం లేకుండానే ఇదంతా జరిగిందా? సీపీ పాత్రపై మాకు తీవ్రమైన అనుమానాలు ఉన్నాయన్నారు పేర్ని నాని.

40 రోజులుగా నిమ్మకు నీరెత్తినట్లు ఎందుకున్నారు?
మే 9 నుంచి దాదాపు 40 రోజుల పాటు ఈ ఉదంతం నడిచింది. “ఆ 40 రోజుల్లో ఒక్కసారి అయినా విజయవాడ సీపీ బాధిత కుటుంబాన్ని పిలిచి మాట్లాడారా? వారి ఫిర్యాదును విన్నారా? ఎందుకు అంత నిర్లక్ష్యం వహించారు?. ఇంత పెద్ద వివాదం జరుగుతున్నా సీపీ ఇప్పటివరకు ప్రజల ముందుకు వచ్చి ఎందుకు నోరు విప్పడం లేదు” అని పేర్ని నాని ప్ర‌శ్నించారు.

సాయికృష్ణ బూడిదైనా చూపించండి..
“అసలు సాయికృష్ణ బతికే ఉన్నాడా? లేక చనిపోయాడా? ఒకవేళ చనిపోతే అతని మృతదేహం ఎక్కడ ఉంది? అస్తికలు ఎక్కడ ఉన్నాయి? కనీసం అతను కాలిపోయిన బూడిద ఎక్కడ ఉందో ఈ ప్రభుత్వం చెప్పగలదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత విజయవాడ సీపీపై లేదా? అని నిల‌దీశారు.

చట్టాన్ని ఖూనీ చేసిన ఎఫ్‌ఐఆర్‌లు
– నాన్-బైలబుల్ వారెంట్ (NBW) ఆధారంగా ఒక వ్యక్తిని తీసుకొస్తే చట్ట ప్రకారం వెంటనే కోర్టులో హాజరుపరచాలి. మరి రోజులు తరబడి హోటల్ గదుల్లో అదుపులో ఉంచి చిత్రహింసలు పెట్టడానికి ఎవరిచ్చారు అనుమతి?
– దళిత యువకుడు క్రాంతికుమార్ కేసులో ఆత్మహత్య జరిగిన 24 గంటల తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం వెనుక మతలబు ఏంటి? విజయవాడలో పోలీసులు చట్టం ప్రకారం పని చేస్తున్నారా లేక సొంత చట్టాలు నడుపుతున్నారా?

సీబీఐ దర్యాప్తు జరగాలి
“ఒక డీసీపీ స్థాయి అధికారి తన పరిధిలోని అధికారులపైనే ఎలా స్వతంత్ర విచారణ చేస్తాడు? టాస్క్‌ఫోర్స్ మహిళా ఏసీపీ, ఇతర ఉన్నతాధికారులను అదే వ్యవస్థలో ఉన్న కింది స్థాయి అధికారులు ఎలా నిష్పక్షపాతంగా విచారించగలరు? కేవలం సీఐలు, కానిస్టేబుళ్లను సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటే సరిపోదు. ప్రభుత్వం నిజంగా నిజాలు బయటకు తీయాలనుకుంటే స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ (CBI) చేత ఎందుకు దర్యాప్తు చేయించడం లేదు?” అని పేర్ని నాని డిమాండ్ చేశారు.

సీఐ ఎక్కడ? చంద్రబాబు హామీ ఏమైంది?
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చి రెండు రోజులు గడిచినా, ఎఫ్‌ఐఆర్ నమోదై 48 గంటలు దాటినా నిందితుడైన కృష్ణలంక సీఐ నాగరాజును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమైతే ఈ ఆలస్యం ఎందుకు జరుగుతోందని, సీఐ ఎక్కడున్నాడో ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోతోందని నిలదీశారు.

క్రాంతికుమార్ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వంపై పేర్ని నాని తీవ్రమైన విమర్శలు చేశారు. సాయికృష్ణ విషయంలో రాజకీయ నష్టం జరుగుతుందని గ్రహించి స్పందించిన చంద్రబాబు, దళిత యువకుడైన క్రాంతికుమార్ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ఆక్షేపించారు. క్రాంతికుమార్ కుటుంబం లేవనెత్తిన ఆరోపణలపై ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉందని, దళిత యువకుడి కుటుంబానికి న్యాయం అవసరం లేదా అని ప్రశ్నించారు.

విజయవాడ కమిషనరేట్ పరిధిలో గంజాయి కింగ్‌పిన్ సొహైల్ ఎలా తప్పించుకున్నాడో చెప్పాలని, ఒకవైపు నేరస్థులు పారిపోతుంటే, మరోవైపు కస్టడీ మరణాల వివాదాలు బయటపడుతున్నాయని మండిపడ్డారు. ప్రభుత్వం ఈ కేసులను మసిపూసి మారేడుకాయ చేయాలని చూస్తే ఊరుకునేది లేదని, తక్షణమే సీపీపై చర్యలు తీసుకుని, సీబీఐ విచారణ జరిపించాలని పేర్ని నాని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment