2014 నుంచి 2019 మధ్య ఏపీని (Andhra Pradesh) వణికించిన భయంకరమైన ‘కాల్ మనీ'(Call Money) రాకెట్ విజయవాడలో(Vijayawada) మళ్లీ పడగవిప్పుతోంది. రక్తం పిండే వడ్డీలతో సామాన్యులను, వ్యాపారులను పట్టిపీడించే ఈ దందా.. అధికార పార్టీ నేతల అండదండలతో మరోసారి బెజవాడ నడిబొడ్డున రెచ్చిపోతోందనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రూ.5 కోట్ల అసలుకు.. ఏకంగా రూ.21 కోట్ల వడ్డీ (Interest) వసూలు చేసి, ఇంకా రూ.5 కోట్లు కట్టాలంటూ వేధిస్తున్న కాల్ మనీ ముఠా ఆగడాలపై గాయత్రి (Gayathri) అనే మహిళా పారిశ్రామికవేత్త తీవ్ర ఆందోళనకు దిగారు.
బాధితురాలి వివరాల ప్రకారం.. వ్యాపార అవసరాల కోసం మహిళా పారిశ్రామిక వేత్త గాయత్రి కాల్ మనీ వ్యాపారుల వద్ద రూ.5 కోట్లు అప్పుగా తీసుకున్నారు. దానికి ప్రతిగా ఇప్పటివరకు వారు ఏకంగా రూ.21 కోట్లను వడ్డీల రూపంలోనే పిండేసుకున్నారు. అంతటితో ఆగకుండా, మరో 5 కోట్ల రూపాయలు కట్టాలంటూ ఆమెపై బెదిరింపులకు దిగారు. దీనిపై తాను పోలీసులను ఆశ్రయించగా.. తీవ్ర ఒత్తిడిల నడుమ గత నెల 27వ తేదీన పోలీసులు ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు చేశారు. అయితే, ఇక్కడే అసలు ట్విస్ట్ చోటుచేసుకుంది.
“నా ఫిర్యాదుపై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన తర్వాత, కాల్ మనీ ముఠా మరింత రెచ్చిపోయింది. నాపై భౌతికంగా దాడి చేసి, ప్రాణభయం (Life Threat) పెట్టి బలవంతంగా ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు (Signatures) చేయించుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసినా నాకు రక్షణ లేకుండా పోయింది” అని గాయత్రి ఆవేదన వ్యక్తం చేశారు.
టీడీపీ పెద్దల హస్తం?
కాల్ మనీ వ్యాపారులు వెనిగళ్ల హర్షవర్ధన్(Venigalla Harshavardhan), హరినాథ్ (Harinath) లు అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన అత్యున్నత స్థాయి నేతల అండ చూసుకునే ఈ అరాచకాలకు పాల్పడుతున్నారని బాధితురాలు గాయత్రి బహిరంగంగా ఆరోపించారు. వెనిగళ్ల హర్షవర్ధన్ వెనుక మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ముఖ్య అనుచరులు ఉన్నారని, ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణం రాజు (RRR) తో పాటు టీడీపీ సీనియర్ నేత దేవినేని చందు (Devineni Chandu) హస్తం కూడా ఉందని బాధితురాలు ఆరోపించారు. ఈ రాజకీయ అండదండల కారణంగానే విజయవాడ ఏసీపీ దామోదర్ పై (Damodar) పైస్థాయి నుంచి తీవ్ర ఒత్తిళ్లు తీసుకువస్తున్నారని గాయత్రి ఆరోపించారు.
న్యాయం జరగకపోతే ‘ఆమరణ దీక్ష’
తనకు న్యాయం జరగకపోతే.. వెనక్కి తగ్గేదే లేదని, న్యాయపోరాటంతో పాటు విజయవాడ నడిబొడ్డున ‘ఆమరణ నిరాహార దీక్ష’కు (Indefinite Hunger Strike) దిగుతానని గాయత్రి హెచ్చరించారు. గతంలో టీడీపీ ప్రతిష్టను తీవ్రంగా మసకబార్చిన కాల్ మనీ వ్యవహారం మళ్లీ కూటమి ప్రభుత్వం (Alliance Government) అధికారంలోకి వచ్చాక తెరపైకి రావడం, అందులోనూ కూటమి ప్రభుత్వంలోని ప్రముఖుల పేర్లను బాధితురాలు వెల్లడించడం కొత్త పరీక్షగా మారింది. మరి బాధితురాలికి న్యాయం జరుగుతుందో లేదో చూడాలి.








