పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలో తీవ్ర సంచలనం రేకెత్తించే ఘటన చోటుచేసుకుంది. అలీపూర్ ప్రాంతంలోని ఒక కీలక ప్రభుత్వ భవనంలో సంభవించిన భారీ అగ్నిప్రమాదంలో దాదాపు 4,000 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (EVMs) పూర్తిగా కాలిబూడిదయ్యాయి. గత నెల (మే) 4వ తేదీన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి, రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా బీజేపీ విజయం సాధించి అధికారాన్ని ఏర్పాటు చేసిన కొద్ది రోజుల్లోనే ఈ ప్రమాదం జరగడం ఇప్పుడు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారాన్ని రేపుతోంది.
అగ్నిప్రమాదం జరిగిన 9 అంతస్తుల ప్రభుత్వ భవనంలో పలు విభాగాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం ఈ భవనంలోనే ఈవీఎంలను భద్రపరిచారు. ప్రమాద స్థలాన్ని పరిశీలించిన బెంగాల్ మంత్రి కౌశిక్ చౌధురీ మాట్లాడుతూ, ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు 10 నియోజకవర్గాల్లో ఉపయోగించిన సుమారు 4,000 ఈవీఎంలు ఈ మంటల్లో పూర్తిగా అగ్ని ఆహుతి అయ్యాయని ధృవీకరించారు.
ఎన్నికల ఫలితాలు వచ్చి, కొత్త ప్రభుత్వం కొలువుదీరిన వెంటనే ఈ స్థాయి ప్రమాదం జరగడం వెనుక ఏదైనా కుట్ర కోణం దాగి ఉందా అనే కోణంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం సాధారణ ప్రమాదంలా కనిపించడం లేదని, దీని వెనుక భారీ కుట్ర కోణం ఉందనే సందేహాలను ప్రతిపక్ష టీఎంసీ వ్యక్తం చేస్తోంది. ప్రస్తుతం అలీపూర్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించగా, ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే ప్రమాదానికి అసలు కారణాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు.
🚨 SHOCKING
— Telugu Feed (@Telugufeedsite) June 12, 2026
కోల్కతాలోని ప్రభుత్వ భవనంలో కాలిపోయిన 4,000 ఈవీఎంలు
గత నెల 4వ తేదీనే పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు
కాలిపోయిన ఈవీఎంలు అసెంబ్లీ ఎన్నికల్లో 10 నియోజకవర్గాలకు వాడినవిగా గుర్తింపు pic.twitter.com/5Gbtt6nUcE
ఏపీలోనూ గతంలో ఈవీఎం ‘డేటా’ వివాదం
పశ్చిమ బెంగాల్‌లో ఈవీఎంలు కాలిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్న తరుణంలో, గతంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఈవీఎం వివాదం మళ్లీ తెరపైకి వస్తోంది. ఏపీలో ఎన్నికల నిబంధనల ప్రకారం నిర్ణీత కాలపరిమితి ముగిసే వరకు ఈవీఎంలలోని డేటాను సురక్షితంగా ఉంచాల్సి ఉండగా, అంతకంటే ముందే డేటాను తొలగించారనే ఆరోపణలు వచ్చాయి. దీనిపై గతంలో అప్పటి ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ పెద్ద ఎత్తున న్యాయ, రాజకీయ పోరాటం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.
ఎన్నికల పారదర్శకత, ఈవీఎంల భద్రతపై దేశవ్యాప్తంగా చర్చ నడుస్తున్న వేళ.. బెంగాల్‌లో 4,000 ఈవీఎంలు తగలబడటం భవిష్యత్తులో మరిన్ని రాజకీయ ప్రకంపనలకు దారితీసేలా కనిపిస్తోంది.








