అన్నామలై రాజీనామా.. బీజేపీకి ఐదు పేజీల లేఖ!

అన్నామలై రాజీనామా.. బీజేపీకి ఐదు పేజీల లేఖ!

తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు నమోదువుతున్నాయి. తమిళనాడు బీజేపీ ఫైర్ బ్రాండ్, మాజీ ఐపీఎస్ అధికారి కె. అన్నామలై ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్‌కు పంపించారు. ఏకంగా 5 పేజీలతో కూడిన ఈ రాజీనామా లేఖలో తమిళనాడులో పార్టీ ప్రస్తుత పరిస్థితి, తాను ఎదుర్కొన్న పరిణామాలు, ఐపీఎస్ పదవిని వదులుకుని బీజేపీలోకి వచ్చిన నాటి పరిస్థితులను అన్నామలై సుదీర్ఘంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ పరిణామం అటు తమిళనాడుతో పాటు ఇటు జాతీయ రాజకీయాల్లోనూ తీవ్ర కలకలం రేపుతోంది.

ఐపీఎస్ వదిలి.. కొరడా దెబ్బలు తిని..
కర్ణాటక కేడర్‌లో సింగం లాంటి ఐపీఎస్ అధికారిగా గుర్తింపు తెచ్చుకున్న అన్నామలై, తమిళనాడులో బీజేపీని ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగించాలనే లక్ష్యంతో తన ఉద్యోగానికి రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు. తమిళనాడు వ్యాప్తంగా ‘ఎన్ మణ్, ఎన్ మక్కల్’ (నా భూమి, నా ప్రజలు) పేరిట సుదీర్ఘ పాదయాత్ర చేసి, చెప్పులు లేకుండా దీక్షలు చేస్తూ, పార్టీ కోసం తీవ్రంగా శ్రమించారు. ఈ క్రమంలో తమిళనాడులో బీజేపీ క్యాడర్‌ను ఉరకలెత్తించిన అన్నామలై.. తీవ్రమైన ఆవేదనతో ఇప్పుడు పార్టీకి దూరం కావడం సంచలనంగా మారింది.

ఓటమిపై ఆవేదన.. సరికొత్త డ్రామాలా?
ఇటీవల ఎన్నికల్లో తమిళనాడులో బీజేపీ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. ఈ ఫెయిల్యూర్స్‌కు గల అంతర్గత కారణాలను అన్నామలై తన లేఖలో గట్టిగానే ప్రస్తావించినట్లు సమాచారం. అయితే, తమిళనాడులో బీజేపీ ఎప్పటికీ కోలుకోదని డిసైడ్ అయ్యి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారా? లేక పార్టీ అధిష్టానంపై ఒత్తిడి తెచ్చి రాజ్యసభ సీటు దక్కించుకోవడం కోసం ఈ సరికొత్త వ్యూహానికి తెరలేపారా? అనే కోణంలోనూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

సొంత పార్టీ దిశగా అడుగులు?
గత వారం రోజులుగా అన్నామలై తీరుపై రాజకీయ వర్గాల్లో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. బీజేపీ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న ఆయన, జాతీయ పార్టీలో ఉంటే తమిళనాడులో ప్రాంతీయ సెంటిమెంట్‌ను తట్టుకుని ఎదగడం కష్టమని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే బీజేపీని వదిలి, తమిళనాడులో సొంతంగా కొత్త ప్రాంతీయ పార్టీని పెట్టాలనే ఆలోచనలో అన్నామలై ఉన్నట్లు ఆయన సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది.

అన్నామలై లాంటి మాస్ లీడర్ రాజీనామాతో తమిళనాడులో బీజేపీకి కోలుకోలేని దెబ్బ తగిలిందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ రాజీనామాపై బీజేపీ అధిష్టానం ఎలా స్పందిస్తుందో, అన్నామలై తన తదుపరి రాజకీయ కార్యాచరణను ఎలా ప్రకటించబోతున్నారో చూడాలి.

Join WhatsApp

Join Now

Leave a Comment