ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ (Mumbai Indians) రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. సోమవారం అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో (Gujarat Titans) జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 99 పరుగుల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 200 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన గుజరాత్ టైటాన్స్ 15.5 ఓవర్లలో 100 పరుగులకే కుప్పకూలి దారుణ ఓటమిని మూటగట్టుకుంది. వాషింగ్టన్ సుందర్ 26 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. ముంబై బౌలర్లలో అశ్వనీ కుమార్ (Ashwani Kumar) 4 వికెట్లతో చెలరేగగా, గజన్‌ఫర్ (Ghazanfar), మిచెల్ సాంట్నర్ (Mitchell Santner) 2 వికెట్లు పడగొట్టారు. సొంతగడ్డపై ఆడిన గుజరాత్ ముంబై బౌలర్ల ధాటికి వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 199 పరుగులు చేసింది.
టాపార్డర్ విఫలమైనప్పటికీ మిడిలార్డర్‌లో తిలక్ వర్మ (101 నాటౌట్) సెంచరీతో విధ్వంసం చెలరేగగా, నమన్ ధిర్ (Naman Dhir) (45) బాధ్యతాయుతంగా ఆడారు. గుజరాత్‌బౌలర్లలో రబాడ 3 వికెట్లు తీయగా, సిరాజ్, ప్రసిధ్ క్రిష్ణ చెరొక వికెట్ తీశారు. సెంచరీతో చెలరేగిన తిలక్ వర్మ (Tilak Varma) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. సీజన్‌లో రెండో విజయం సాధించిన ముంబై 4 పాయింట్లతో పట్టికలో ఏడో స్థానానికి ఎగబాకింది. మరోవైపు గుజరాత్ టైటాన్స్ ఆడిన 6 మ్యాచ్‌ల్లో మూడు విజయాలు, మూడు పరాజయాలతో పట్టిలకలో ఆరో స్థానంలో కొనసాగుతోంది.








