పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడులో (Akividu) రామాలయం (Rama Temple) నిర్మాణంపై ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు (Raghurama Krishna Raju) ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో (Andhra Pradesh High Court) చుక్కెదురైంది. ఈ వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాలతో రఘురామ చేపట్టిన రామాలయం నిర్మాణ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ఆకివీడు మండలంలోని పెద్దపేటలో శిథిలావస్థలో ఉన్న ‘గొంతెనమ్మ గుడి’ని (Gonthenamma Temple) కూల్చివేసి, అక్కడ కొత్తగా రామాలయాన్ని (Rama Temple) నిర్మించాలన్న రఘురామ నిర్ణయాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై కోర్టు కీలక తీర్పునిచ్చింది.
హైకోర్టులో హోరాహోరీ వాదనలు
ఆకివీడు మండలం (Akiveedu Mandal) పెద్దపేటకు చెందిన వంగ జోష్ణ దేవి (Vanga Joshna Devi), ఇతరులు దాఖలు చేసిన ఈ వ్యాజ్యంపై ప్రముఖ న్యాయవాది జడ శ్రావణ్ కుమార్ (Jada Sravan Kumar) లంచ్ మోషన్ ద్వారా అత్యవసర విచారణ కోరారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా, మున్సిపల్ కమిషనర్ పర్మిషన్ లేనిదే మతపరమైన నిర్మాణాలు చేపట్టడం ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ యాక్ట్ (Andhra Pradesh Municipal Corporation Act) సెక్షన్ 202, 209 ప్రకారం చట్టవిరుద్ధమని జడ శ్రావణ్ కుమార్ వాదించారు. మతపరమైన నిర్మాణాలు ప్రజల ఇష్టానుసారం జరగాలి తప్ప, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కకూడదని పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టు (Supreme Court) తీర్పులను ప్రస్తావించారు.
కోర్టుకు హాజరైన రఘురామకృష్ణరాజు
విచారణ విషయం తెలుసుకున్న రఘురామకృష్ణరాజు స్వయంగా కోర్టుకు హాజరయ్యారు. తనకు మాట్లాడే అవకాశం ఇవ్వాలని న్యాయమూర్తిని కోరిన ఆయన, “అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే రామాలయం కడతాం” అని స్పష్టం చేశారు. అలాగే, పిటిషనర్లలో ఒకరు ఇప్పటికే క్రైస్తవ మతం తీసుకున్నారని, దీని వెనుక ఇతర కారణాలు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. అయితే, ఆ విషయాలు ఇక్కడ తేల్చలేమని న్యాయమూర్తి స్పష్టం చేశారు.
హైకోర్టు కీలక ఆదేశాలు
వాదనలు విన్న అనంతరం హైకోర్టు ఈ క్రింది ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ అనుమతులు లేకుండా శిథిలావస్థలో ఉన్న భవనాన్ని కూల్చడం గానీ, కొత్త నిర్మాణాలు చేపట్టడం గానీ చేయకూడదని స్పష్టం చేసింది. ప్రభుత్వం తరపు న్యాయవాది శిరీష వివరణ ఇస్తూ, అన్ని అనుమతులు తీసుకున్న తర్వాతే ముందుకెళ్తామని చెప్పడంతో.. నిబంధనలు పాటించాలని కోర్టు పేర్కొంది. ఈ వ్యవహారంలో ప్రతివాదులందరికీ నోటీసులు జారీ చేస్తూ, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను హైకోర్టు నాలుగు వారాలకు వాయిదా వేసింది.








