ఆంధ్రప్రదేశ్‌లో డ్రగ్స్ మహమ్మారి విచ్చలవిడిగా విస్తరిస్తోంది. ఒకప్పుడు గంజాయికి నిలయంగా ఉన్న రాష్ట్రం, ఇప్పుడు కొకైన్, మెథాంఫేటమిన్ వంటి ఖరీదైన డ్రగ్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతోంది. ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, అమరావతి వంటి నగరాల్లో డ్రగ్స్ నెట్‌వర్క్ వేగంగా విస్తరిస్తోందన్న వార్త తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. విద్యాసంస్థలే లక్ష్యంగా సాగుతున్న ఈ దందా యువత భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తోంది.
విద్యాసంస్థలే టార్గెట్.. బెంగుళూరు నుంచే సరఫరా!
నగరాల్లోని ఇంజనీరింగ్ కాలేజీలు, ప్రైవేట్ యూనివర్సిటీలే లక్ష్యంగా డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. హైదరాబాద్, బెంగళూరు వంటి మెట్రో నగరాల నుండి కేరియర్ల ద్వారా డ్రగ్స్ ఏపీలోకి ప్రవేశిస్తున్నాయి. పోలీసులు పలుమార్లు దాడులు చేసి డ్రగ్స్‌ను పట్టుకుంటున్నా, కేవలం చిన్న చిన్న ఏజెంట్లను మాత్రమే అరెస్ట్ చేస్తున్నారని, అసలు సూత్రధారులైన ‘బడా బాబుల’ జోలికి వెళ్లడం లేదనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి.
100 రోజుల హామీ.. 650 రోజులైనా ఫలితం లేదు!
2024 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలిస్తామని హామీ ఇచ్చారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సుమారు 650 రోజులు గడిచినా, క్షేత్రస్థాయిలో పరిస్థితి ఏమాత్రం మారలేదు. ప్రభుత్వం కేవలం సమీక్షలకే పరిమితమైందని, నివారణా చర్యలు కాగితాలకే పరిమితమయ్యాయని విపక్షాలు మండిపడుతున్నాయి.
దేశవ్యాప్తంగా సంచలనం.. డ్రగ్స్‌తో టీడీపీ ఎంపీ
రాష్ట్రంలో డ్రగ్స్ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి తాజా ఉదంతమే నిదర్శనం. హైదరాబాద్ శివార్లలోని మొయినాబాద్‌లో జరిగిన డ్రగ్స్ పార్టీపై ‘ఈగల్’ (EAGLE) పోలీసులు జరిపిన దాడిలో ఏలూరు టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ పట్టుబడడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మొదట మూత్ర పరీక్షలో నెగటివ్ వచ్చినప్పటికీ, ఆయన శాంపిల్‌లో నీరు కలిపినట్లు పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత నిర్వహించిన రక్త పరీక్షల్లో డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. డ్రగ్స్ సేవించి పట్టుబడిన దేశంలోనే మొట్టమొదటి సిట్టింగ్ ఎంపీగా మహేష్ యాదవ్ వార్తల్లో నిలవడం పార్టీకి, ప్రభుత్వానికి పెద్ద తలవంపుగా మారింది.
ఎన్నికల ముందు డ్రగ్స్ ముక్త ఆంధ్రప్రదేశ్ అని నినదించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇప్పుడు తమ పార్టీ ఎంపీనే అడ్డంగా దొరికిపోవడంతో సమాధానం చెప్పలేక ఇరకాటంలో పడ్డారు. ప్రస్తుతం ఆయనను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని మాత్రమే ఆదేశించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షోకాజ్ నోటీసులతోనే ఎంపీ డ్రగ్స్ వ్యవహారాన్ని సరిపెట్టారని ప్రజలు మండిపడుతున్నారు.
ఆందోళనలో తల్లిదండ్రులు
ప్రజాప్రతినిధులే ఇలా డ్రగ్స్ అలవాట్లకు బానిసలైతే, సామాన్య యువతకు వీరు ఏం సందేశం ఇస్తున్నారని మేధావులు ప్రశ్నిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలల సమీపంలో డ్రగ్స్ చాక్లెట్లు, గంజాయి ప్యాకెట్లు సులభంగా దొరుకుతుండటంతో తమ పిల్లల భవిష్యత్తు ఏమైపోతుందోనని తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే ఏపీ మరో పంజాబ్‌లా మారే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి.








