తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanam) అంటే కోట్లాది హిందువుల విశ్వాసానికి ప్రతీక. అలాంటి పవిత్ర క్షేత్ర పరిపాలనలో నైతిక ప్రమాణాలు అత్యంత కీలకం. అయితే ఇటీవల టీటీడీ చుట్టూ తిరుగుతున్న వివాదాలు రాజకీయంగా పెద్ద చర్చకు దారి తీశాయి. గతంలో జరిగిన చర్యలు, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పోల్చుతూ నెట్టింట పెద్ద ఎత్తున చర్చ కొనసాగుతోంది.
నాడు పృథ్వీ ఘటన.. వెంటనే చర్యలు
గత వైసీపీ ప్రభుత్వ (YSRCP Government)హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) చైర్మన్గా నటుడు పృథ్వీరాజ్ (Actor Prudhvi Raj) బాధ్యతలు నిర్వర్తించారు. ఆ సమయంలో ఆయన ఓ మహిళతో అసభ్యంగా మాట్లాడినట్లు ఆడియో బయటకు రావడంతో వివాదం చెలరేగింది. వెంటనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి (YS Jagan Mohan Reddy) ప్రభుత్వం ఆలస్యం చేయకుండా పృథ్వీని పదవి నుంచి తప్పించింది. ధార్మిక సంస్థ ప్రతిష్ఠ దెబ్బతినకూడదనే ఉద్దేశంతో తీసుకున్న చర్యగా వైసీపీ వర్గాలు అప్పట్లో పేర్కొన్నాయి.
నేడు బీఆర్ నాయుడు వివాదం.. కొనసాగింపు
ప్రస్తుతం టీటీడీ(TTD) చైర్మన్గా ఉన్న బీఆర్ నాయుడు (BR Naidu)పై కూడా వ్యక్తిగత ప్రవర్తనకు సంబంధించిన ఆరోపణలు వెల్లువెత్తాయి. ఓ మహిళతో అనైతిక సంబంధం, వేధింపుల ఆరోపణలు, వీడియోలు, ఫోటోలు బయటకు రావడం రాజకీయంగా దుమారం రేపుతోంది. ఈ ఆరోపణలపై ప్రతిపక్షం తీవ్రంగా స్పందిస్తుండగా, ప్రభుత్వం మాత్రం ఆయనను పదవి నుంచి తొలగించలేదు. ఇదే అంశంపై “నాడు శిక్ష.. నేడు రక్ష?” అంటూ సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది.
పవన్ కల్యాణ్ పాత్రపై విమర్శలు
గతంలో వైసీపీ నుంచి సస్పెండ్ అయిన పృథ్వీని తరువాత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తన పార్టీలో చేర్చుకోవడం కూడా ఇప్పుడు చర్చకు వస్తోంది. ఆ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయ అవసరాల కోసం వ్యక్తులపై ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
టీటీడీ చైర్మన్ నియామకంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) పాత్రపై కూడా ప్రశ్నలు లేవుతున్నాయి. చైర్మన్ నియామకానికి ముందే ఆరోపణలు ఉన్నప్పటికీ పదవి ఇవ్వడం ఎందుకని ప్రతిపక్షం ప్రశ్నిస్తోంది. ధార్మిక సంస్థల పరిపాలనలో పారదర్శకత, నైతిక ప్రమాణాలు ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ధర్మం అంటే మాటల్లోనా? ప్రవర్తనలోనా?
తిరుమల క్షేత్రం కేవలం పరిపాలనా వ్యవస్థ కాదు.. అది కోట్లాది భక్తుల ఆత్మీయ విశ్వాసం. భక్తి అంటే కేవలం జపం కాదు.. బాధ్యత, వినయం, నైతికత కూడా కావాలి. పదవుల్లో ఉన్నవారు ఆరోపణలు ఎదురైనప్పుడు ఆత్మపరిశీలన చేయాలా? లేక ఎదురుదాడి చేయాలా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
ప్రజాస్వామ్యంలో తుది తీర్పు ప్రజలదే. టీటీడీ వంటి అత్యున్నత ఆధ్యాత్మిక సంస్థల ప్రతిష్ఠను కాపాడటంలో ఎవరి వైఖరి ధర్మబద్ధంగా ఉంది? ఎవరి చర్యలు పారదర్శకంగా ఉన్నాయి? అనే అంశంపై ప్రజల్లో విస్తృత చర్చ సాగుతోంది. తిరుమల శ్రీవారి సన్నిధిలో చిత్తశుద్ధి, నైతికత, బాధ్యత ఇవే అసలు ప్రమాణాలుగా ఉండాలనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.







