వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి (Kethireddy Venkataramireddy) తీవ్ర వ్యాఖ్యలతో రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు. పార్టీ నాయకులతో (Party Leaders) జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, కష్టకాలంలో పార్టీని వదిలి వెళ్లిన వారిని తిరిగి చేర్చే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఎవరు బంధుత్వం పేరుతో తిరిగి తీసుకురావాలని ప్రయత్నించినా కఠినంగా ఎదుర్కొంటానని హెచ్చరించారు.
వెన్నుపోటుదారులకు నో ఎంట్రీ
పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లబ్ధి పొందుతూ, ఎన్నికల తరువాత పార్టీ మారిన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించబోమన్నారు. శత్రువు అయినా పార్టీలో చేర్చుకుంటామని, కానీ ద్రోహం చేసినవారికి మాత్రం అవకాశమే లేదని మండిపడ్డారు. అర్హత లేని వారు, నిబద్ధత లేని వారు తిరిగి రావాలని ప్రయత్నించినా ద్వారం మూసే ఉంటుందని పేర్కొన్నారు.
వైసీపీకి కార్యకర్తలే బలం అని, వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) నాయకత్వంలో మళ్లీ ప్రభుత్వం ఏర్పడితే వారికే ప్రాధాన్యం ఉంటుందని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీను(YSRCP) ధర్మవరం నియోజకవర్గంలో మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే వేలాది మందికి పార్టీ బాధ్యతలు ఇచ్చామని, రాబోయే స్థానిక ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా పని చేయాలని కార్యకర్తలకు సూచించారు.







