ఇక‌నైనా అప్పులపై అబద్ధాలు ఆపుతారా..?

ఇక‌నైనా అప్పులపై త‌ప్పుడు ప్ర‌చారం ఆపుతారా..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల అంశం మళ్లీ రాజకీయ చర్చలకు దారి తీసింది. శాసన మండలి వేదికగా వైసీపీ స‌భ్యులు అడిగిన ప్ర‌శ్న‌కు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం వెల్లడించిన గణాంకాలు, ముఖ్యమంత్రి చేస్తున్న వ్యాఖ్యలకు విరుద్ధంగా ఉన్నాయని తేట‌తెల్ల‌మ‌వుతోంది.

శాసన మండలిలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించిన వివరాల ప్రకారం, వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వ కాలం(2019-24)లో బడ్జెట్ ద్వారా తీసుకున్న అప్పులు మొత్తం కేవ‌లం రూ.2,34,225 కోట్లుగా ఉన్నాయని తెలిపారు. అలాగే గత పదేళ్లలో కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు రూ.1,40,479 కోట్లుగా నమోదయ్యాయని మంత్రి స్పష్టం చేశారు.

మొత్తం రాష్ట్ర అప్పులు 2024 సంవత్సరం వరకు రూ.4,91,734 కోట్లుగా ఉన్నాయని మంత్రి సభా రికార్డులో లిఖిత‌పూర్వ‌కంగా స‌మాధాన‌మిచ్చారు. 2024 వరకు కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పులు కూడా రూ.1,40,479 కోట్లేనని కూట‌మి ప్ర‌భుత్వంలోని ఆర్థిక మంత్రి చెప్పారు. అయితే 2024 తరువాత కార్పొరేషన్ల ద్వారా తీసుకున్న అప్పుల వివరాలు మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదని విమర్శలు వినిపిస్తున్నాయి.

ఇదిలా ఉండగా, వైఎస్ జగన్ ప్రభుత్వ కాలంలో రూ.10 లక్షల కోట్ల నుండి రూ.14 లక్షల కోట్ల వరకు అప్పులు చేశారంటూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాజకీయ సభల్లో ఆరోపణలు చేస్తున్న విష‌యం తెలిసిందే. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ప్ర‌చారం విప‌రీతంగా చేశారు. రాష్ట్రం శ్రీ‌లంక అయిపోతోంద‌ని, అప్పుల కుప్ప అంటూ దుష్ప్ర‌చారం చేశారు.

శాసనసభ, శాసనమండలి వేదికగా కూట‌మి ప్ర‌భుత్వ ఆర్థిక‌ మంత్రి ఇచ్చిన గణాంకాలు ఒక‌లా ఉండగా, రాజకీయ వేదికలపై సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌, మంత్రులు మ‌రోలా మాట్లాడడం రాజ‌కీయ దురుద్దేశ‌మ‌న్న విష‌యం ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతోందంటున్నారు వైసీపీ శ్రేణులు

గతంలో కూడా అసెంబ్లీ సాక్షిగా మంత్రి పయ్యావుల కేశవ్ రాష్ట్ర అప్పులపై స్పష్టమైన వివరణ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు. శాసనసభల్లో అధికారికంగా ఇచ్చిన గణాంకాలను పరిగణలోకి తీసుకుని, అప్పుల అంశంపై తప్పుడు ప్రచారాలు ఇక‌నైనా కూట‌మి పెద్ద‌లు మానుకోవాల‌నే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై స్పష్టత ఇవ్వడం ప్రభుత్వ బాధ్యత అని, ప్రజలకు నిజమైన సమాచారం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రతిపక్ష నాయకులు కోరుతున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment