ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మధ్య కీలక భేటీ జరిగింది. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో జరిగిన ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలు, రాబోయే రాజ్యసభ ఎన్నికలపై విస్తృతంగా చర్చించినట్టు సమాచారం. రాష్ట్ర రాజకీయాల్లో వేగంగా మారుతున్న పరిస్థితుల నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
సమావేశంలో ప్రధానంగా వైసీపీని ఎదుర్కొనే వ్యూహాలపై చంద్రబాబు–పవన్ కల్యాణ్ మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. వైసీపీపీ చేపడుతున్న రాజకీయ, సోషల్ మీడియా ప్రచారానికి ఎలా దీటుగా స్పందించాలి, కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి వస్తున్న విమర్శలకు ఎలా కౌంటర్ చేయాలన్న అంశాలపై ఇద్దరు నేతలు అభిప్రాయాలు పంచుకున్నట్లుగా తెలుస్తోంది.
టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు వైసీపీ రాజకీయ ఉచ్చులో పడకుండా అప్రమత్తంగా ఉండాలన్న అంశంపైనా సమావేశంలో చర్చ జరిగింది. ముఖ్యంగా కార్యకర్తల స్థాయిలో కూటమి విధానాలను బలంగా తీసుకెళ్లడం, అనవసర వివాదాల్లో ఇరుక్కోకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరంపై నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్టు సమాచారం.
అలాగే, త్వరలో ఖాళీ కానున్న నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీ అంశంపైనా ఈ సమావేశంలో ప్రాథమిక చర్చ జరిగిన అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. అభ్యర్థుల ఎంపిక, కూటమిలో సమన్వయం, బీజేపీతో సంబంధాలపై వ్యూహాత్మకంగా ముందుకెళ్లే అంశాలపై కూడా ఈ భేటీలో అభిప్రాయాలు పంచుకున్నట్టు తెలుస్తోంది. రాష్ట్ర రాజకీయాల్లో ఈ సమావేశం కీలక మలుపుగా మారుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది.









పవన్.. ఓ దిష్టి కల్యాణ్.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు