‘లోకేశ్‌ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి’ – ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన జోగి

'లోకేశ్‌ ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి' - ఆధారాలు బ‌య‌ట‌పెట్టిన జోగి

తన నివాసంపై దాడికి సంబంధించిన సంచలన ఆధారాల‌ను మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేష్ బయటపెట్టారు. ఈ దాడి పూర్తిగా పథకం ప్రకారమే జరిగిందని ఆయన ఆరోపించారు. మంత్రి నారా లోకేశ్ ఆదేశాలతో, ఎంపీ కేశినేని చిన్ని ఆధ్వర్యంలోనే ఈ దాడికి తెరలేపారని జోగి రమేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

విజ‌య‌వాడ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. దాడికి సంబంధించిన ఆధారాలు చూపించారు. బ్లేడ్ బ్యాచ్, గంజాయి గ్యాంగ్‌లను ప్రేరేపించి తనపై దాడి చేయించారని, వందల మంది టీడీపీ గూండాలు తన ఇంటిపై దాడికి పాల్పడ్డారని తెలిపారు. ఈ దాడి కేవలం తనపై మాత్రమే కాదని, ప్రజాస్వామ్యంపై, బడుగు, బలహీన వర్గాలపై జరిగిన దాడిగా ఆయన అభివర్ణించారు.

తనను భౌతికంగా లేకుండా చేయాలన్న దురుద్దేశంతోనే ఈ దాడి జరిగిందని జోగి రమేష్ ఆరోపించారు. వైసీపీ శ్రేణుల్లో భయాన్ని నింపాలనే లక్ష్యంతో ఈ కుట్రకు పాల్పడ్డారని పేర్కొన్నారు. గతంలో తనపై తప్పుడు కేసులు పెట్టి 83 రోజుల పాటు జైలులో పెట్టి వేధించారని, ఆరోపణలు నిరూపించేందుకు సత్యప్రమాణానికి రమ్మన్నా ప్రభుత్వం ముందుకు రాలేదని అన్నారు.

“ఇంకా మీ కడుపుమంట చల్లారలేదా? నేను చేసిన తప్పేంటి చంద్రబాబు?” అంటూ జోగి రమేష్ ప్రశ్నించారు. ప్రభుత్వ అరాచకాలను ప్రశ్నించడమే తన నేరమా? రాజకీయాల్లో ఉండకూడదా? మాట్లాడకూడదా? అంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను అనకూడని మాటలు ఏం అన్నానో చంద్రబాబే చెప్పాలని డిమాండ్ చేశారు.

తనను, తన కుటుంబాన్ని నాశనం చేసేందుకు చంద్రబాబు, లోకేశ్ కంకణం కట్టుకున్నారని ఆరోపించారు. ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టించి మరీ ఇతర ప్రాంతాల నుంచి బ్లేడ్ బ్యాచ్, జేబులుకొట్టే వారిని తీసుకొచ్చారని తెలిపారు. తన ఇంటిపై దాడికి ముందు పోలీసులు, టీడీపీ నేతలు కలిసి ప్లాన్ చేశారని, దాడి చేసిన వారికి పోలీసులు ఎస్కార్ట్ కూడా ఇచ్చారని ఆరోపించారు.

పెట్రోల్ బాంబులతో తన ఇంటిపై దాడి చేసి చప్పట్లు కొట్టారని, రాక్షసత్వంగా దాడి చేసి చివరకు రివర్స్‌లో తనపైనే కేసులు పెట్టారని మండిపడ్డారు. లోకేశ్ నేతృత్వంలోనే ఈ దాడి జరిగిందని మరోసారి స్పష్టం చేశారు. భవిష్యత్తులో తనకు ఏ ఇబ్బంది జరిగినా అందుకు పూర్తిగా లోకేశ్‌నే బాధ్యుడని హెచ్చరించారు.

“నా ఇల్లు తగలబెట్టి లోకేశ్ దగ్గర మార్కులు కొట్టేద్దామని కొందరు సంబరపడుతున్నారు. గుర్తుంచుకోండి… ఎవరినీ విడిచిపెట్టేది లేదు. నా ఇంటికి నీ ఇల్లు ఎంత దూరమో, నీ ఇంటికి నా ఇల్లు కూడా అంతే దూరంలో ఉంది” అంటూ లోకేశ్‌కు జోగి రమేష్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. జోగి రమేష్ ఆరోపణలపై ప్రభుత్వం, టీడీపీ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment