రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా కూలిపోయాయని, ఆంధ్రప్రదేశ్ “జంగిల్‌రాజ్”గా మారిపోయిందని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబుపై టీడీపీ అల్లరి మూకలు కర్రలు, ఇనుప రాడ్లతో దాడికి యత్నించిన ఘటనను తీవ్రంగా ఖండిస్తూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి హింసను ఆయుధంగా మార్చుకుందని మండిపడ్డారు.
“చంద్రబాబూ.. మీ దుర్మార్గాలను ప్రశ్నిస్తే హత్యాయత్నాలు, దాడులు చేయిస్తారా? తిరుమల లడ్డూ ప్రసాదాన్ని అడ్డుపెట్టుకుని మీరు చేసిన కుట్ర విఫలమైందనే భంగంతో మావారిపై దాడులు చేయిస్తున్నారా?” అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. నిజాలు బయటకు వస్తున్నాయని తట్టుకోలేక హింసకు దిగుతున్నారని, మీ పాలనలో చట్టం, న్యాయం అన్న పదాలకు అర్థం లేకుండా పోయిందని విమర్శించారు.
తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు, పందికొవ్వు కలిసిందంటూ చంద్రబాబు ప్రభుత్వం చేసిన తప్పుడు ప్రచారం ప్రతిష్ఠాత్మక NDDB, NDRI ల్యాబుల నివేదికలతో పూర్తిగా భగ్నమైందని జగన్ గుర్తుచేశారు. కోట్లాది మంది భక్తుల మనోభావాలను గాయపరిచినందుకు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తీవ్రంగా చీదరించుకుంటున్నారని తెలిపారు. క్షమాపణ చెప్పాల్సిన స్థితిలో ఉండి కూడా, తప్పులను దాచిపెట్టేందుకు కొత్త కుట్రలకు తెరలేపడం దుర్మార్గమని ఆరోపించారు.
అంబటి రాంబాబుపై జరిగిన దాడి ప్రయత్నం పూర్తిగా ముందస్తు ప్రణాళికతో జరిగిన హత్యాయత్నమని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దాడిని అడ్డుకోవడంలో పోలీసులు ఘోరంగా విఫలమయ్యారని, దాడులకు కాపలా కాసినట్లుగా వ్యవహరించారంటూ తీవ్రంగా తప్పుబట్టారు. చంద్రబాబు ఆదేశాలతోనే టీడీపీ రౌడీలు అంబటి ఇంటిపైకి వెళ్లి దాడికి యత్నించారని ఆరోపించారు.
అంబటితో పాటు భూమన కరుణాకర్ రెడ్డి, విడదల రజిని, బొల్లా బ్రహ్మనాయుడు వంటి వైసీపీ నేతలపై వరుస దాడులు జరగడం రాష్ట్రంలో భయానక పరిస్థితులకు నిదర్శనమని వైఎస్ జగన్ అన్నారు. ఇది చంద్రబాబు నియంత స్వభావానికి నిదర్శనమని, ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగ వ్యవస్థలకు ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు.
ఈ ఘటనలపై రాష్ట్ర గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. దాడులను అడ్డుకోవడంలో విఫలమైన డీజీపీ, గుంటూరు డీఐజీ, ఎస్పీ సహా బాధ్యత వహించాల్సిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే వైసీపీ నాయకులకు తగిన భద్రత కల్పించాలని కేంద్ర హోంశాఖను విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ అంశంపై వైసీపీ ఎంపీలు కేంద్ర ప్రభుత్వానికి వినతిపత్రం అందజేస్తారని ప్రకటించారు.
రాష్ట్రంలో జరుగుతున్న ఈ పరిణామాలు చంద్రబాబు పాలన ఎంత ప్రమాదకర దిశలో సాగుతోందో స్పష్టంగా చూపిస్తున్నాయని వైసీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.








