చెప్పినట్టుగానే, మాట ఇచ్చినట్టుగానే వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలతో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఏలూరు నుంచి ప్రారంభమైన నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తల సమావేశాలు.. ఉభయ గోదావరి జిల్లాలపై ప్రత్యేక ఫోకస్‌తో కొనసాగుతున్నాయి. పార్టీ సంస్థాగత బలోపేతం, భవిష్యత్ కార్యాచరణపై క్యాడర్‌కు స్పష్టమైన దిశానిర్దేశం ఇస్తూ జగన్ ముందుకు సాగుతున్నారు.
ఇటీవల నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకున్న జగన్, పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. భీమవరం నియోజకవర్గ నాయకులు, ముఖ్యమైన కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో జగన్ రాష్ట్ర రాజకీయాలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు పూర్తవుతున్నా, మూడు బడ్జెట్లు పెట్టినా ప్రజలకు ఒక్క మంచి పని కూడా జరగలేదని జగన్ మండిపడ్డారు. గతంలో తమ ప్రభుత్వంలో ఒక మాట చెబితే ఆ మాట మీద నిలబడే పాలన ఉండేదని, మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించి ప్రతి హామీని నెరవేర్చామని గుర్తుచేశారు.
కూటమి ప్రభుత్వంలో మహిళలకు భద్రత ఎక్కడ?
ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో మహిళలపై జరుగుతున్న ఘటనలను ప్రస్తావిస్తూ జగన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ ఉద్యోగినిని బెదిరించడం, ఆముదాలవలస ఎమ్మెల్యే వేధింపులు భరించలేక ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై మహిళా దాడి ఆరోపణలు వంటి ఘటనలు రాష్ట్రంలో జంగిల్ రాజ్‌ను తలపిస్తున్నాయని విమర్శించారు. మంత్రి సంధ్యారాణి పీఏపై మహిళ ఫిర్యాదు చేస్తే నిందితుడిని అరెస్ట్ చేయాల్సింది పోయి బాధితురాలినే జైలుకు పంపడం, మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ రికార్డింగ్ డ్యాన్సులు చేయడం వంటి ఘటనలు రాష్ట్రంలో విచ్చలవిడి తనానికి నిదర్శనమని అన్నారు.
సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అబద్ధాలే
చంద్రబాబు అధికారంలోకి వచ్చాక వైసీపీ ప్రభుత్వంలో అమలు చేసిన పథకాలన్నీ రద్దయ్యాయని జగన్ ఆరోపించారు. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అంటూ ఇచ్చిన హామీలు పూర్తిగా అబద్ధాలుగా మారాయని, ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని విమర్శించారు. చివరకు గ్యాస్ సిలిండర్ల విషయంలో కూడా మోసాలు చేస్తున్నారని అన్నారు.
తమ ఐదేళ్ల పాలనలో కోవిడ్ ఉన్నా దాదాపు రూ.3.32 లక్షల కోట్ల అప్పులు చేశామని, అందులో రూ.2.73 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని జగన్ వివరించారు. ఎవరికెవరికీ డబ్బులు వెళ్లాయో బ్యాంక్ ఖాతాలు, ఆధార్ ఆధారంగా చూపించగలమని స్పష్టం చేశారు. అయితే చంద్రబాబు రెండేళ్లలోనే రూ.3 లక్షల కోట్ల అప్పులు చేశారని, ఆ డబ్బు ఎక్కడికి పోయిందో చెప్పాలని ప్రశ్నించారు.
సంక్రాంతి వేళ జంగిల్ రాజ్
ఇటీవల సంక్రాంతి రోజుల్లో రాష్ట్రంలో జరిగిన పరిణామాలను ప్రస్తావించిన జగన్, ప్రభుత్వమా లేక జంగిల్ రాజ్ా అన్నట్టుగా పరిస్థితులు మారాయని విమర్శించారు. కోడిపందాలకు వేలంపాటలు, తాగుడు, డ్యాన్సులు, బెట్టింగులు ఇవన్నీ ప్రభుత్వమే దగ్గరుండి జరిపించిందని ఆరోపించారు. ఎమ్మెల్యేలు, పోలీసులు, పాలకులే ఈ వ్యవహారాల్లో భాగస్వాములయ్యారని తీవ్ర విమర్శలు చేశారు.
భీమవరం డీఎస్పీ వ్యాఖ్యలను ఉదాహరణగా చూపుతూ, “ఊపేయ్, కుదిపేయ్” అన్న స్థాయిలో పోలీసులే మాట్లాడుతున్న పరిస్థితి రాష్ట్రంలో ఉందని అన్నారు. రాష్ట్రం పూర్తిగా జంగిల్ రాజ్‌గా మారిపోయిందని, బరితెగింపుకు అడ్డుకట్ట లేకుండా పోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమావేశాల ద్వారా పార్టీ క్యాడర్‌ను ఉత్సాహపరిచి, రానున్న రోజుల్లో ప్రజా సమస్యలపై మరింత దూకుడుగా పోరాడేందుకు జగన్ సిద్ధం చేస్తున్నారని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.







