గణతంత్ర దినోత్సవాన్ని (Republic Day) పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం 2026 సంవత్సరానికి గాను దేశ అత్యున్నత పౌర పురస్కారాలైన పద్మ అవార్డులను (Padma Awards) ప్రకటించింది. ఆదివారం విడుదలైన జాబితాలో వివిధ రంగాలకు చెందిన మొత్తం 131 మంది ప్రముఖులు ఈ గౌరవాన్ని దక్కించుకున్నారు.
ఈ జాబితాలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. అవార్డు గ్రహీతల్లో 19 మంది మహిళలు, 16 మందికి మరణానంతరం పురస్కారాలు ప్రకటించగా, విదేశీయులు, ఎన్నారైల విభాగంలో 6 మంది చోటు దక్కించుకున్నారు. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సైన్స్, ప్రజా వ్యవహారాలు, సామాజిక సేవ వంటి విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందించిన వారిని ఈసారి కేంద్రం గౌరవించింది.
పద్మవిభూషణ్‌కు ఐదుగురు
దేశానికి అసాధారణ సేవలందించినందుకు ఇచ్చే రెండో అత్యున్నత పౌర పురస్కారం పద్మవిభూషణ్ ఈసారి ఐదుగురిని వరించింది. బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్రసింగ్ దేవల్ (మహారాష్ట్ర) (Dharmendra Singh Deol – Maharashtra), కేరళ మాజీ ముఖ్యమంత్రి వి.ఎస్. అచ్యుతానందన్ (V. S. Achuthanandan – Kerala)లకు మరణానంతరం ఈ గౌరవం దక్కింది. వీరి వెంట ప్రజా వ్యవహారాల విభాగంలో కె.టి. థామస్ (కేరళ) (K. T. Thomas – Kerala), కళల విభాగంలో ప్రముఖ వయోలిన్ విద్వాంసురాలు ఎన్. రాజమ్ (ఉత్తరప్రదేశ్) (N. Rajam – Uttar Pradesh), సాహిత్యం–విద్య విభాగంలో పి. నారాయణన్ (కేరళ) (P. Narayanan – Kerala) పద్మవిభూషణ్‌కు ఎంపికయ్యారు.
పద్మభూషణ్‌లో ప్రముఖుల సందడి
విశిష్ట సేవలకు గాను ఇచ్చే పద్మభూషణ్ పురస్కారానికి 13 మంది ఎంపికయ్యారు. ఈ జాబితాలో ప్రముఖ గాయని అల్కా యాగ్నిక్, మలయాళీ నటుడు మమ్ముట్టి, మాజీ గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ, పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్, భారత టెన్నిస్ దిగ్గజం విజయ్ అమృత్‌రాజ్, ప్రచార రంగంలో పేరుగాంచిన పియూష్ పాండే (మరణానంతరం) వంటి ప్రముఖులు ఉన్నారు.
తెలుగు రాష్ట్రాలకు పద్మ పంట
ఈసారి పద్మ పురస్కారాల్లో తెలుగు రాష్ట్రాలకు విశేష గౌరవం దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మాగంటి మురళీమోహన్ (Maganti Murali Mohan)కు కళల విభాగంలో పద్మశ్రీ లభించింది. అలాగే గద్దె బాబూ రాజేంద్ర ప్రసాద్ (Gadde Babu Rajendra Prasad) (కళలు), గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ (Garimella Balakrishna Prasad) (మరణానంతరం – కళలు), వెంపటి కుటుంబ శాస్త్రి (Vempati Kutumba Sastry) (సాహిత్యం) కూడా ఏపీ నుంచి ఎంపికయ్యారు.
తెలంగాణ నుంచి ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి దీపికా రెడ్డి, వైద్య రంగంలో గూడూరు వెంకట రావు, పాల్కొండ విజయ్ ఆనంద్ రెడ్డి పద్మశ్రీ అందుకోనున్నారు. సైన్స్ రంగంలో చంద్రమౌళి గడ్డముణుగు, కృష్ణమూర్తి బాలసుబ్రమణియన్, కుమారస్వామి తంగరాజ్, పశుసంవర్థక విభాగంలో రామారెడ్డి మామిడి (మరణానంతరం) తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. అలాగే యూజీసీ మాజీ చైర్మన్, నల్గొండ జిల్లాకు చెందిన మామిడాల జగదీశ్ కుమార్‌కు సాహిత్యం, విద్యా రంగంలో పద్మశ్రీ వరించింది.
క్రీడా, సినీ రంగాలకు గౌరవం
క్రీడా రంగంలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ, మహిళా క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్, భారత హాకీ జట్టు గోల్‌కీపర్ సవితా పునియా పద్మశ్రీకి ఎంపికయ్యారు. సినీ రంగం నుంచి బెంగాలీ నటుడు ప్రోసెన్జిత్ ఛటర్జీ, నటుడు సతీష్ షా (మరణానంతరం), అనిల్ కుమార్ రస్తోగి కూడా ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఎప్పుడు అవార్డుల ప్రదానం?
ఈ పురస్కారాలను మార్చి లేదా ఏప్రిల్ నెలలో రాష్ట్రపతి భవన్లో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు గ్రహీతలకు అందజేయనున్నారు.









పవన్.. ఓ దిష్టి కల్యాణ్.. టీపీసీసీ చీఫ్ సంచలన వ్యాఖ్యలు