కుమార్తె (Daughter) తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని, ఆమెను చూసేందుకు దుబాయ్ (Dubai) నుంచి వచ్చిన వైసీపీ (YSRCP) సోషల్ మీడియా కార్యకర్తను ఏపీ పోలీసులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలోనే (Shamshabad International Airport) అరెస్టు చేయడం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై వైసీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
బద్వేల్ నియోజకవర్గానికి (Badvel Assembly Constituency) చెందిన శ్రీనివాస్ రెడ్డి(Srinivas Reddy) గత రెండేళ్లుగా దుబాయ్‌లో ఉద్యోగం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల ఆయన కుమార్తె తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. ఈ విషయం తెలిసిన వెంటనే శ్రీనివాస్ రెడ్డి దుబాయ్ నుంచి సోమవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నారు.
అయితే విమానాశ్రయానికి చేరుకున్న వెంటనే ఏపీ పోలీసులు శ్రీనివాస్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. కనీసం ఏ కేసులో అరెస్టు చేస్తున్నారో, ఏ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్తున్నారో కూడా చెప్పకుండా బెదిరింపులకు పాల్పడ్డారని వైసీపీ ఆరోపిస్తోంది. కుమార్తెను ఒక్కసారి కూడా చూసే అవకాశం ఇవ్వకుండా పోలీసులు వ్యవహరించడం అత్యంత అమానుషమని పార్టీ నేతలు మండిపడ్డారు.
ఈ అరెస్టు పూర్తిగా అక్రమమని, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సోషల్ మీడియా కార్యకర్తలను టార్గెట్ చేస్తున్నారని వైసీపీ ఆగ్రహిస్తోంది. ప్రజాస్వామ్య దేశంలో ఒక తండ్రికి తన అనారోగ్యంతో ఉన్న కుమార్తెను చూసే హక్కు కూడా లేకుండా చేయడం దుర్మార్గమని పేర్కొంది. ఇలాంటి చర్యలు పోలీస్ వ్యవస్థపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని దెబ్బతీస్తాయని పార్టీ నేతలు హెచ్చరించారు.








