ఢిల్లీలో జరిగిన బాంబు పేలుళ్ల దర్యాప్తు విషయంలో తమ దేశం భారతదేశానికి సహాయం అందించిందని అమెరికా (America) విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో (Marco Rubio) బుధవారం తెలిపారు. కెనడాలో జరిగిన G-7 విదేశాంగ మంత్రుల సమావేశం అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రూబియో (Rubio) ఈ విషయాన్ని వెల్లడించారు.
అయినప్పటికీ, భారత దర్యాప్తు సంస్థలను ప్రశంసిస్తూ, “భారత్(India)కు చెందిన దర్యాప్తు సంస్థలు చాలా ప్రొఫెషనల్‌గా, ఖచ్చితమైన దర్యాప్తును నిర్వహించగల పూర్తి సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. వారికి మా సహాయం అవసరం లేదు” అని అన్నారు. భారత్ ఈ దాడిపై సొంతంగా దర్యాప్తు చేసుకోగలదని అమెరికా భావిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
మరోవైపు, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎక్స్ (X) వేదికగా మార్కో రూబియోతో తన భేటీ వివరాలను పంచుకున్నారు. G7 సమావేశంలో రూబియోను కలవడం ఆనందంగా ఉందని, ఢిల్లీలో జరిగిన పేలుడులో ప్రాణనష్టానికి ఆయన సంతాపం తెలియజేశారని జైశంకర్ పేర్కొన్నారు. ఈ భేటీలో వాణిజ్యం, సరఫరా గొలుసులపై దృష్టి సారించి ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించామని తెలిపారు. అంతేకాకుండా, ఉక్రెయిన్ వివాదం, మధ్యప్రాచ్యం/పశ్చిమ ఆసియా పరిస్థితి, ఇండో-పసిఫిక్‌పై ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నట్లు జైశంకర్ ట్వీట్ చేశారు.








