దశాబ్దాలుగా టాలీవుడ్‌ను శాసిస్తున్న ఒకే ఒక్క సామ్రాజ్యం.. ‘మెగా కాంపౌండ్’. చిరంజీవి అనే ఒకే ఒక్కడితో మొదలైన ఈ ప్రస్థానం, కాలక్రమేణా డజన్ల కొద్దీ హీరోలు, సొంత ప్రొడక్షన్ బ్యానర్లు, అగ్ర నిర్మాతల నెట్‌వర్క్‌తో ఇండస్ట్రీలో తిరుగులేని పట్టు సాధించింది. కొడుకు, తమ్ముళ్లు, మేనల్లుళ్లు, అల్లుళ్లు.. ఇలా ఒకే ఫ్యామిలీ నుంచి ఒక ఆర్మీయే సిల్వర్ స్క్రీన్‌పై ఊగిసలాడింది. కానీ, కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా! ఇప్పుడు టాలీవుడ్‌లో వినిపిస్తున్న లేటెస్ట్ ఇన్సైడ్ టాక్ ఏంటంటే.. మెగా ఫ్యామిలీ క్రేజ్ నెమ్మదిగా మసకబారుతోంది!
మెగా కాంపౌండ్ నుంచి ఎంతమంది హీరోలు ఉన్నప్పటికీ, ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద మినిమం గ్యారెంటీ వసూళ్లు రాబట్టేది కేవలం మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రామ్ చరణ్ మాత్రమే అనే చర్చ ఫిలిం నగర్ సర్కిల్స్‌లో జోరుగా సాగుతోంది. ఈ ఇద్దరు మినహా మిగిలిన మెగా హీరోల చిత్రాలపై ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ‘మెగా హీరో’ అనే ట్యాగ్ లైన్ వినడానికి ఉన్న బేస్.. థియేటర్లలో వారి సినిమాల్లో కనిపించడం లేదు. భారీ ఫ్యాన్ బేస్ ఉందనుకునే పవన్ కళ్యాణ్ సినిమాలు సైతం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మ్యాజిక్ చేయలేకపోతున్నాయి, యావరేజ్ టాక్‌కే ఆపసోపాలు పడుతున్నాయి.
ప్రస్తుతం ఇండియన్ సినిమా అంతా ‘పాన్ ఇండియా’ ట్రెండ్ వైపు దూసుకుపోతోంది. ఇండస్ట్రీలో నిలబడాలంటే యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలు ఎంచుకోవాలి. మెగా ఫ్యామిలీలో రామ్ చరణ్ మినహా మరే హీరో కూడా ఈ ట్రెండ్‌కు తగ్గట్టుగా అడుగులు వేయడం లేదనేది బహిరంగ రహస్యం.
ఆఖరికి కోలీవుడ్ (తమిళం) నుంచి వచ్చి టాలీవుడ్‌లో మార్కెట్ క్రియేట్ చేసుకున్న సూర్య, కార్తీ, ధనుష్, మాలీవుడ్ స్టార్ దుల్కర్ సల్మాన్ సినిమాలకు తెలుగులో వస్తున్న కలెక్షన్లు, క్రేజ్.. మన మెగా హీరోల సినిమాలకు రాకపోవడం ఏంటని స్వయంగా మెగా ఫ్యాన్సే తలలు పట్టుకుంటున్నారు.
టాలీవుడ్‌లో మరోవైపు ‘యువరక్తం’ ఉత్సాహంగా దూసుకొస్తూ తమ హవాను చాటుకుంటోంది. ప్రభాస్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, అక్కినేని నాగచైతన్య వంటి స్టార్లు ఓ రేంజ్‌లో దుమ్ములేపుతుంటే.. మరోవైపు ఆనంద్ దేవరకొండ, సంతోష్ శోభన్ బ్రదర్స్, సుమంత్ ప్రభాస్ లాంటి యంగ్ అండ్ ప్రామిసింగ్ హీరోలు ఇండస్ట్రీలో తమ పాగా వేసుకుంటున్నారు. వరుస సినిమాలు చేస్తూ, ప్రొడ్యూసర్లకు సేఫ్ ప్రాజెక్టులు అందిస్తూ టాలీవుడ్‌లో కొత్త సమీకరణాలకు తెరతీస్తున్నారు.
ఒకప్పుడు మెగా హీరోతో సినిమా చేయాలంటే డైరెక్టర్లు లైన్లు కట్టేవారు. కానీ ఇప్పుడు మెగా ఫ్యామిలీ నుంచి రెండేళ్లకు కలిపి రెండు సినిమాలు కూడా సరిగ్గా రావడం లేదు. దీంతో అసలు కథలు చెప్పేందుకు దర్శకులు మెగా కాంపౌండ్ వైపు వెళ్లడం లేదా? లేక మెగా హీరోలే సరైన జడ్జిమెంట్‌తో కథలను ఎంచుకోలేకపోతున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఏది ఏమైనా, మెగా మేనియాకు కాలం చెల్లుతోందా.. లేక మళ్లీ స్ట్రాంగ్ కంబ్యాక్‌తో టాలీవుడ్‌పై పట్టు సాధిస్తారా అనేది కాలమే నిర్ణయించాలి.








