అధికారం మారిపోతే.. రేపు మన పరిస్థితి ఏమిటీ?

అధికారం మారిపోతే.. రేపు మన పరిస్థితి ఏమిటీ?

అదే ప‌నిగా కేసులు పెడుతున్నాం.. వైసీపీ కార్య‌క‌ర్త కాస్త యాక్టీవ్‌గా ఉన్నాడ‌ని తెలిస్తే మ‌నోభావాలు దెబ్బ‌తిన్నాయ‌ని అరెస్టులు చేయిస్తున్నాం. ఇక మాజీ మంత్రులు, ప్రజాప్రతినిధుల్ని అయితే ఆధారాలు చూపకుండానే జైళ్ళకు పంపుతున్నాం. రోజూ ప్రెస్ మీట్లు పెట్టి ఉన్నవీ లేనివీ కల్పించి జగన్, వైసీపోళ్ళ మీద బురద జల్లమని పార్టీ అధిష్టానం షంటుతోంది. రేపు అధికారం పోతే మన పరిస్థితి ఏమిటీ?.. ఇదీ అత్యధిక శాతం మంది టీడీపీ మంత్రులు, ప్రజాప్రతినిధుల మదిలో మెదులుతున్న ప్రశ్న..

ఆయన (జగన్) అధికారంలోకి వస్తే తప్పు చేసిన వాళ్ళను సప్త సముద్రాల అవతల ఉన్న తీసుకొచ్చి చట్టప్రకారం శిక్షిస్తామని చెబుతున్నాడు. మీకు ఏ అధికారి వల్ల అయినా, ఏ ప్ర‌జాప్ర‌తినిధి కార‌ణంగానైనా అన్యాయం జరిగిందో డిజిటల్ బుక్ లో ఆధారాల‌తో ఫిర్యాదు చేయమని చెప్పాడు. మన పేర్లు డిజిటల్ బుక్ లోకి చేరితే లేనిపోని తలనొప్పులు కొని తెచ్చుకున్నట్లే బ్రదర్.. ఇదీ కొందరు పోలీస్ అధికారుల మధ్య జరుగుతున్న చర్ఛ.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు గడిచింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమ‌లు కూడా సంపూర్ణం కాలేదు. అమ‌లు చేసిన వాటిల్లో ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం కార‌ణంగా ప్ర‌భుత్వాన్ని ఈస‌డించుకుంటున్నారు ప్ర‌యాణికులు. మిగిలిన ప‌థ‌కాల్లో ల‌బ్ధిదారుల కోత‌, గుంత‌ల రోడ్లు, క‌ల్తీ మ‌ద్యం, ఆడ‌వారిపై అఘాయిత్యాలు వంటి అంశాలతో ప్రజావ్యతిరేకత గూడు కట్టుకుంటుంది. దీంతో కూటమి ప్రభుత్వం ఇర‌కాటంలో ప‌డింది. వీటి నుంచి ప్ర‌జ‌ల దృష్టి మ‌ళ్లించేందుకే ప్ర‌భుత్వం వైరి వ‌ర్గాన్ని అరెస్టులు, కేసులు అంటూ ఇబ్బందిపెడుతూ, డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్‌కు తెర‌లేపుతోంద‌న్న వాద‌న ఉంది.

ఈ నేప‌థ్యంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను టార్గెట్ చేస్తూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాలంటూ అధినేత నుంచి మంత్రులు, టీడీపీ ప్రజాప్రతినిధులపై ఒత్తిడి పెరుగుతోందట‌. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో తమ పార్టీ అధినేత కంట్లో పడేందుకు కొందరు మంత్రులు అత్యుత్సాహం ప్రదర్శించిన వారంతా మెల్ల‌మెల్ల‌గా స‌ద్దుమ‌ణిగారు. విమ‌ర్శ‌ల డోస్‌ను త‌గ్గిస్తూ మ‌న‌కెందుకొచ్చిన తంటా అంటా అని నిమ్మ‌కుండిపోతున్నారట‌.

ప్రభుత్వ పథకాలు పూర్తిస్థాయిలో అందకపోవడం, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఇష్టారీతి వ్య‌వ‌హారం కార‌ణంగా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందన్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ మాటను మొన్న జ‌రిగిన కేబినెట్ భేటీ అనంత‌రం సీఎం చంద్ర‌బాబు నాయుడే అంగీక‌రించారు. ఇంకొన్నాళ్లు పోతే సీన్ రివర్స్ అవ్వడం ఖాయమన్న అభిప్రాయంతో కొందరు మంత్రులు జగన్ పై విమర్శల దూకుడు తగ్గిస్తున్నారట‌. దీంతో కొంద‌రు మంత్రులే మాట్లాడాల్సిన ప‌రిస్థితి. ఇది టీడీపీ అధిష్టానానికి ఏ మాత్రం మింగుడు పడటం లేదు. దీంతో మంత్రులు అందరూ మాట్లాడకపోతే ఎలా.. కొత్త వాళ్ళైనా మీకు పదవులు ఇచ్చాం కదా.. అంటూ క్లాస్ తీస్తున్నారన్నది టాక్.

ఒకవైపు ప్రభుత్వ పథకాలు అరకొరగా అమలు అవుతున్నాయన్న అసంతృప్తితో ప్రజలు రగిలిపోతుంటే మరోవైపు నియోజకవర్గాల్లో అధికారపార్టీ ఎమ్మెల్యేల దందాలు పెరుగుతుండటంపై నేరుగా సీఎంఓకే ఫిర్యాదులు వెళుతున్నట్లు టాక్. ఈక్రమంలోనే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల వైఖరి మారాలంటూ సీఎం క్లాస్ తీసినట్లు తెలుస్తోంది. మొత్తం మీద దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనుకొనే అధికారపార్టీ ఎమ్మెల్యేల ఆలోచన టీడీపీ అధిష్టానానికి కొత్త తలనొప్పులు తెచ్చిపెడుతోందనేది ఆ సర్కిళ్ళలో జరుగుతున్న చర్చ..

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పోలీస్ అధికారుల నుంచి వివిధ శాఖల ప్రభుత్వ అధికారుల వరకు కొందరు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమ‌ర్శ‌లున్నాయి. కేసులు పెట్టడం దగ్గర నుంచి ప్రభుత్వ పథకాల అమలు వరకు పక్షపాతాన్ని ప్రదర్శిస్తున్నారన్న చ‌ర్చ జ‌రుగుతోంది. ఏడాదిన్నరగా విసిగిపోయిన జనం డిజిటల్ బుక్ లో ఫిర్యాదు చేస్తే.. రేపు గవర్నమెంట్ మారితే మన పరిస్థితి ఏంటన్న భయం కొందరు అధికారుల్ని వెంటాడుతోంద‌న్న అభిప్రాయం వ్య‌క్తం అవుతోంది.

Join WhatsApp

Join Now

Leave a Comment